అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Egg price | సామాన్యుడి పౌష్టికాహారంగా గుర్తింపు పొందిన కోడిగుడ్డు ధరలు (Egg prices) ఇప్పుడు వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గుడ్డు ధరలు రికార్డు స్థాయికి చేరడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
కొద్ది నెలల క్రితం వరకు రిటైల్ మార్కెట్‌లో (retail market) రూ.5 నుంచి రూ.6 వరకు ఉన్న ఒక్కో గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కు చేరింది. అంతేకాదు, హోల్‌సేల్ మార్కెట్‌లోనే (wholesale market) గుడ్డు ధర రూ.7.30కు పైగా పలుకుతుండడం గమనార్హం.. ఇటీవల వరకు 30 గుడ్లు ఉన్న ఒక ట్రే ధర హోల్‌సేల్‌లో రూ.160 నుంచి రూ.170 మధ్య ఉండేది. ఇప్పుడు అదే ట్రే ధర రూ.210 నుంచి రూ.220కు పెరిగింది.
Egg price | భారంగా కోడి గుడ్డు..
మరోవైపు, నాటు కోడిగుడ్లు ఒక్కొక్కటి రూ.15 వరకు విక్రయిస్తున్నారు. ఈ ధరలు సామాన్య వినియోగదారుడిపై అదనపు భారం మోపుతున్నాయి. పౌల్ట్రీ పరిశ్రమ వర్గాల ప్రకారం, డిమాండ్‌కు తగినంత ఉత్పత్తి లేకపోవడమే ఈ ఆకస్మిక ధరల పెరుగుదలకు ప్రధాన కారణం. గతంలో తెలుగు రాష్ట్రాల్లో (Telugu states) రోజుకు సగటున సుమారు 8 కోట్ల గుడ్ల ఉత్పత్తి జరిగేది. అయితే ఇటీవల కాలంలో కోళ్లకు అవసరమైన దాణా, మక్కలు, చేపపొట్టు వంటి ముడిసరుకుల ధరలు భారీగా పెరగడంతో చాలా మంది రైతులు పౌల్ట్రీ ఫారాల నిర్వహణను నిలిపివేశారు. దీని ఫలితంగా గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది.
ఈ పరిస్థితిపై ఓ కోడిగుడ్ల వ్యాపారి మాట్లాడుతూ.. “ప్రస్తుతం హోల్‌సేల్‌లో రూ.7.30, రిటైల్‌లో రూ.8 పలుకుతున్న ధర పౌల్ట్రీ చరిత్రలోనే ఆల్‌టైం గరిష్ఠం. మరో రెండు నెలల పాటు ఇవే ధరలు Rates కొనసాగే అవకాశం ఉంది” అని తెలిపారు. నిపుణుల అంచనాల ప్రకారం.. గుడ్ల ఉత్పత్తి మళ్లీ సాధారణ స్థాయికి చేరే వరకు ధరలు తగ్గే అవకాశం కనిపించడం లేదు. దీంతో వచ్చే కొన్ని నెలలు కోడిగుడ్డు సామాన్యుడికి మరింత భారంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.