అక్షరటుడే, వెబ్డెస్క్ : Special Funds | రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులుగా భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. వానలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండుకుండల్లా మారాయి. అయితే వర్షాలతో పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం జిల్లాలకు నిధులు విడుదల చేసింది.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.33 కోట్లు విడుదల చేసింది. అత్యవసర పనుల (Emergency works) కోసం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు నిధులు కేటాయించింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యవసర పనుల నిమిత్తం వీటిని వినియోగించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రజల భద్రత, సహాయక చర్యలకు ఆటంకాలు కలుగకుండా చర్యలు చేపట్టాలని సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో పలు గ్రామాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల వంతెనలు కూలిపోయాయి. చెరువులకు బుంగలు పడే అవకాశం ఉంది. అలాగే శిథిలావస్థలో ఉన్న ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో తాత్కాలిక రోడ్లు, తక్షణ ఉపశమన చర్యలను అధికారులు చేపట్టనున్నారు.