అక్షరటుడే, మెదక్ : Edupayala Temple | మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఏడుపాయల దుర్గా భవాని ఆలయం (Edupayala Durga Bhavani Temple) జల దిగ్బంధంలోనే ఉంది. ఆలయం ముందు నుంచి మంజీర ఉధృతంగా ప్రవహిస్తోంది.
మంజీర ఏడుపాయలుగా వీడిపోయిన ప్రాంతంలో, పచ్చని అడవుల (green forests) మధ్య ఉన్న దుర్గామాత అమ్మవారిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో అమ్మవారి దర్శనంతో పాటు ప్రకృతి అందాలను తిలకించడానికి ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు. అయితే ఈ ఏడాది దాదాపుగా నెల రోజులకు పైగా ఆలయం మూసి ఉంది.
Edupayala Temple | సింగూరు నుంచి వరద
ఎగువన కురుస్తున్న వర్షాలతో సింగూరు ప్రాజెక్ట్‌కు (Singur project) భారీగా వదర వస్తోంది. దీంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. జలాశయానికి ప్రస్తుతం 52,649 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఆరు గేట్లు ఎత్తి అధికారులు 48,212 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆ నీరు ఏడుపాయలలోని ఘనపురం ఆనకట్ట (Ghanapuram dam) మీద నుంచి పొంగి ఆలయం ముందు నుంచి వెళ్తున్నాయి. దీంతో అధికారులు ఆలయాన్ని మూసివేశారు.
Edupayala Temple | రాజగోపురంలో పూజలు
వానాకాలం (monsoon season) ప్రారంభం నుంచి మొన్నటి వరకు మంజీర ఉధృతంగా ప్రవహించడంతో 27 రోజుల పాటు ఆలయాన్ని మూసి ఉంచారు. అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురంలో ఉంచి నిత్య పూజలు చేశారు.
అయితే ఇటీవల వరద తగ్గడంతో గుడిని శుభ్రం చేసి రెండు రోజుల పాటు భక్తులకు దర్శనం కల్పించారు. మళ్లీ మంజీరకు వరద పోటెత్తడంతో ఆలయాన్ని తాకుతూ నీళ్లు వెళ్తున్నాయి. దీంతో అధికారులు ఆలయాన్ని మూసివేసి రాజగోపురంలో పూజలు చేస్తున్నారు. భక్తులు అక్కడే అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు నీళ్లవైపు వెళ్లకుండా అధికారులు చర్యలు చేపట్టారు.