అక్షరటుడే, వెబ్డెస్క్:Bandi Sanjay | కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తెలిపారు. యూపీఏ హయాంలో విద్యకు రూ.68 వేల కోట్లు మాత్రమే కేటాయిస్తే, మోదీ ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ఏకంగా రూ.1.28 లక్షల కోట్లను కేటాయించిందన్నారు. గత 11 ఏళ్లలో విద్య కోసమే రూ.8 లక్షల కోట్లకుపైగా నిధులు కేటాయించామని చెప్పారు. నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతోనే కేంద్రం నవోదయ, ఏకలవ్య, సైకిల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందన్నారు. మంగళవారం సిరిసిల్ల జిల్లా(Sircilla District) కేంద్రంలో సిరిసిల్లతో పాటు తంగళ్లపల్లి(Thangallapalli)లో టెన్త్ చదువుకునే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బండి సంజయ్ సైకిళ్లను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు.
Bandi Sanjay | అద్దె సైకిల్ మీద తిరిగేటోళ్లం..
తాను పేద కుటుంబం నుంచి వచ్చానని, సొంతంగా సైకిల్ కూడా ఉండేది కాదని బండి సంజయ్ గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో(Public Schools) చదువుకునే విద్యార్థులంతా పేద కుటుంబాలకు చెందిన వారేనని, ఆ బాధ విద్యార్థులు పడకూడదనే ఉద్దేశంతోనే టెన్త్ విద్యార్థులందరికీ(Tenth Students) సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. మాది పేద కుటుంబమే. కానీ సైకిల్ తొక్కాలనే ఆశ ఉండేది. అప్పుడు గంటకు 15 పైసల చొప్పున కిరాయికి తీసుకుని సైకిల్ తొక్కేటోడిని. ఆ పైసలకే నానా ఇబ్బంది పడేవాడిని. ఆ ఇబ్బంది మీకు రాకూడదనే ఉద్దేశంతోనే సైకిల్ పంపిణీ(Bicycle Distribution) చేస్తున్నామని వివరించారు. ఎంపీగా ఉన్నంత కాలం ప్రతి ఏటా టెన్త్ చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను పంపిణీ చేస్తానని ప్రకటించారు. దీంతోపాటు త్వరలోనే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ ‘మోదీ కిట్స్’పేరుతో బ్యాగు, వాటర్ బాటిల్, పెన్నులు, పెన్సిళ్లు, నోట్ బుక్స్ అందజేస్తానని తెలిపారు.
Bandi Sanjay | విద్యార్థులను ప్రోత్సహించాలనే..
విద్య, వైద్య రంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రధాని మోదీ చెబుతున్నారని, ఆ స్పూర్తితోనే సైకిళ్ల పంపిణీ చేపట్టినట్లు వివరించారు. విద్యార్థులకు ఏ ఆస్తి ఉండదు. వారికి సైకిల్ మొట్ట మొదటి ఆస్తి. ఆ మొదటి ఆస్తిని విద్యార్థులకు సమకూర్చడం చాలా సంతోషం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సైకిళ్ల పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఇవి బతుకమ్మ చీరల్లేక్క క్వాలిటీ లేనివి కావని, బ్రాండెడ్ సైకిళ్లు అని తెలిపారు. గతంలో ఎంతో మంచి చేయాలని భావించినా అప్పటి ప్రభుత్వం స్పందించకపోయేదని, అధికారులు సహకరించకపోయే వాళ్లని బీఆర్ ఎస్ పాలనను విమర్శించారు. ఇప్పుడా ఆ పరిస్థితి లేదు. అధికారులు సహకరిస్తున్నారని చెప్పారు.
‘అంబేద్కర్ ఎంత గొప్పవాడో మీకు తెలుసు. ఆయన అనేక ఇబ్బందులు పడ్డారు. తినడానికి తిండి లేకపోయినా, అంటరానివాడంటూ హేళన చేసినా వాటిని అధిగమిస్తూ ఉన్నత చదువులు చదువుకుంటూ గొప్ప రాజ్యాంగాన్ని అందించారని’ బండి తెలిపారు. పట్టుదల, ప్రణాళిక, క్రమశిక్షణ ఉంటేనే లక్ష్యాన్ని చేరుకోగలరని, పుస్తకాలు చదవేటప్పుడు తల దించుకుని చదవాలి. అమ్మనాన్నల కష్టాన్ని గుర్తు చేసుకోవాలి. ఉన్నత స్థాయికి చేరుకుని దేశానికి సేవ చేయాలని విద్యార్థులకు సూచించారు. ‘నేను చిన్నప్పుడే ఆర్ఎస్ఎస్ శాఖ(RSS Branch)కు వెళ్లేటోడిని. అప్పుడే దేశం కోసం, ధర్మం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్న. అనుకున్నది సాధించిన. మీరు కూడా మీ లక్ష్య సాధన కోసం కష్టపడి చదువుకోవాలని’ కోరారు.
Bandi Sanjay | ప్రభుత్వ పాఠశాలలే మేలు..
ప్రభుత్వ పాఠశాలల్లోనే అన్ని అర్హతులున్న టీచర్లు ఉంటారని, చదువు బాగా చెబుతారని బండి సంజయ్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని అర్హతలున్న టీచర్లు మాత్రమే మీకు పాఠాలు బోధిస్తారు. కానీ ప్రైవేట్ స్కూళ్లలో అర్హతలు లేని వాళ్లే ఎక్కువ మంది టీచర్లుగా ఉంటూ చదువు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మంచి విద్యను బోధిస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వాళ్లే సివిల్స్ కు ఎంపికవుతున్నారనే విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రైవేట్ పాఠశాలలు చాలా మేరకు ర్యాంకులు కొంటున్నాయనే విషయాన్ని గుర్తుంచుకోండని’ తెలిపారు.