అక్షరటుడే, వెబ్‌డెస్క్ : EVM | బీహార్ ఎన్నికల ముందర కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లపై ఉండే గుర్తులు, అభ్యర్థుల ఫొటోలు (Candidates Photos) మరింత స్పష్టంగా కనిపించేలా కొన్ని నిబంధనలను సవరించింది.
ఇక నుంచి జరిగే అన్ని ఎన్నికల్లో ఈవీఎం బ్యాలెట్ పేపర్లపై (EVM Ballot Papers) గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫొటోలు ముద్రించనున్నారు. అలాగే, సీరియల్ నంబర్లు కూడా స్పష్టంగా కనిపించేలా మార్పులు చేయనున్నారు. త్వరలో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.
EVM | అభ్యర్థి కలర్ ఫొటోతో పాటు గుర్తు కనిపించేలా..
కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ 1961లోని 49బి నిబంధన ప్రకారం ఎన్నికల కమిషన్ (Election Commission) ప్రస్తుత నిబంధనలను సవరించింది. డిజైన్, ఈవీఎం బ్యాలెట్ పేపర్ల ప్రిటింగ్ మరింత స్పష్టతగా, రీడబిలిటీ ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియను మెరుగుపరచడం, ఓటర్లకు మరింత సౌలభ్యం పెరిగేందుకు గత ఆరు నెలలుగా కసరత్తు చేస్తోంది. కొత్త నిబంధనల ప్రకారం ఈవీఎం బ్యాలెట్ పేపర్లపై అభ్యర్థుల ఫొటోలు కలర్లో ముద్రిస్తారు. ఫొటో స్పేస్‌లో నాలుగింట మూడు వంతులు అభ్యర్థి ఫొటో ఉంటుంది. అభ్యర్థులు/నోటా సీరియల్ నెంబర్లు ఇంటర్నేషనల్ ఫారమ్ ఆఫ్ ఇండియన్ న్యూమరల్స్ పద్ధతిలో ప్రింట్ చేస్తారు. స్పష్టత కోసం అక్షరాకృతి పరిమాణం (font size) 30గా, బోల్డ్‌లో ఉంటుంది. ఈవీఎం బ్యాలెట్ పేపర్లు 70 జీఎస్ఎం పేపర్‌పై ముద్రిస్తారు. అసెంబ్లీ ఎన్నికల కోసం నిర్దిష్ట ఆర్జీబీ విలువలున్న పింక్ కలర్ పేపర్‌ను ఉపయోగిస్తారు.
EVM | ఓటర్లకు అర్థమయ్యేలా..
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ బ్యాలెట్ పేపర్లను మరింత చదవగలిగేలా, ఓటర్లకు అనుకూలంగా మార్చడానికి భారత ఎన్నికల కమిషన్ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. ఎన్నికల విధానాలను క్రమబద్ధీకరించడానికి, ఓటర్లకు ఎక్కువ స్పష్టతను నిర్ధారించడానికి చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగానే ఈ మార్పులు చేపట్టింది.
- కలర్ ఫొటోలు : తొలిసారిగా అభ్యర్థుల కలర్ ఫొటోలను EVM బ్యాలెట్ పేపర్లపై ముద్రిస్తారు. దృశ్యమానతను పెంచడానికి ప్రతి అభ్యర్థి ముఖం ఫొటో స్థలంలో మూడు వంతుల వంతును కవర్ చేస్తుంది.
- ప్రముఖ క్రమ సంఖ్యలు : అభ్యర్థుల కోసం క్రమ సంఖ్యలు, NOTA (పైన పేర్కొన్నవి ఏవీ లేవు) అంతర్జాతీయ భారతీయ సంఖ్యలలో ముద్రించబడతాయి. స్పష్టంగా చదవడానికి 30 బోల్డ్ ఫాంట్ సైజులో నంబర్లు ఉంటాయి.
- సింగిల్ ఫాంట్ : అభ్యర్థుల పేర్లు, NOTA ఒకే ఫాంట్ రకం, పరిమాణంలో ముద్రించబడతాయి. సులభంగా చదవడానికి తగినంత పెద్దవిగా ఉంటాయి.
- పేపర్ నాణ్యత, రంగు : బ్యాలెట్ పేపర్లు 70 GSM పేపర్‌పై ముద్రించబడతాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం RGB విలువలతో కూడిన నిర్దిష్ట గులాబీ రంగు కాగితం ఉపయోగించబడుతుంది.