అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Election Commission | దేశంలో ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి ఎన్నికల సంఘం (ECI) చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 476 రిజిస్టర్డ్ గుర్తింపు లేని రాజకీయ పార్టీలను (RUPPs) జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టింది. రాజకీయ పార్టీల (Political Parties) రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం.. ఆరేళ్లు ఎన్నికల్లో పోటీ చేయని దానిని రిజిస్టర్డ్ పార్టీల జాబితా నుంచి తొలగించే అధికారం ఉంది. దీంతో ఈ నెల 9న ఈసీ తొలి విడతలో 334 పార్టీలను రద్దు చేసింది. తాజాగా మరో 476 రిజిస్టర్డ్ పార్టీలను జాబితా నుంచి తొలగించే ప్రక్రియ ప్రారంభించినట్లు పేర్కొంది.
Election Commission | నోటీసులు ఇచ్చి..
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 29సీ, ఆదాయపన్ను చట్టం-1961, ఎన్నికల గుర్తులు ఆర్డర్ 1968 కింద జాబితా నుంచి తొలగించిన పార్టీలు ప్రయోజనాలు పొందలేవని ఈసీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే 334 పార్టీలను తొలగించగా.. తాజాగా 476 పార్టీలను గుర్తించినట్లు పేర్కొంది. ఏ పార్టీని అనవసరంగా తొలగించకుండా.. ముందుగా నోటీసులు ఇవ్వాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించింది. సీఈవో(CEO)ల నివేదిక ఆధారంగా గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలపై చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం వెల్లడించింది.
Election Commission | తెలుగు రాష్ట్రాల నుంచి 26 పార్టీలు
ఎన్నికల సంఘం రద్దు చేయడానికి గుర్తించిన 476 పార్టీల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 26 పార్టీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)కు చెందిన 17, తెలంగాణ (Telangana)కు చెందిన 9 పార్టీలను జాబితా నుంచి తొలగించాలని ఈసీ నిర్ణయించింది. దేశంలో ఆగస్టు 9న 334 పార్టీలను రద్దు చేయడంతో గుర్తింపు పొందని రిజిస్టర్డ్ పార్టీల సంఖ్య 2,520కి చేరింది. మరోసారి పార్టీలను రద్దు చేస్తే ఆ సంఖ్య మరింత తగ్గనుంది. కాగా ఈ నెల 9 న రద్దు చేసిన పార్టీల్లో తెలంగాణకు చెందిన 13, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 5 పార్టీలు ఉన్నాయి.