HomeతెలంగాణEatala Rajender | సీఎం రేవంత్‌రెడ్డికి ఈటల స‌వాల్‌.. ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఎంపీ కౌంట‌ర్‌

Eatala Rajender | సీఎం రేవంత్‌రెడ్డికి ఈటల స‌వాల్‌.. ముఖ్య‌మంత్రి వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఎంపీ కౌంట‌ర్‌

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Eatala Rajender | కేబినెట్ ఆమోదం లేకుండానే కాళేశ్వ‌రం ప్రాజెక్టు(Kaleswaram Project) నిర్మించార‌ని చెబుతున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ విష‌యాన్ని నిరూపిస్తే తాను రాజ‌కీయాల‌నుంచి త‌ప్పుకుంటాన‌ని బీజేపీ ఎంపీ, మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్(Eatala Rajender) స‌వాల్ చేశారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి కేబినెట్ అనుమ‌తి తీసుకోలేద‌ని రేవంత్‌రెడ్డి చెప్ప‌డం అసంబద్ధ‌మ‌న్నారు. కేబినెట్‌లో చ‌ర్చించి ఆమోదం తెలిపిన త‌ర్వాతే కాళేశ్వ‌రం నిర్మాణం చేపట్టిన‌ట్లు వివ‌రించారు. కేబినెట్(Cabinet) అనుమ‌తి తీసుకోలేద‌ని చెబుతున్న రేవంత్‌రెడ్డి ఆ విష‌యాన్ని నిరూపిస్తే తాను రాజ‌కీయాల‌ను వ‌దిలేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్‌లో ఈట‌ల గురువారం విలేక‌రుల‌తో మాట్లాడారు. కేబినెట్ ఆమోదం లేకుండా క‌ట్టార‌ని బుధ‌వారం సీఎం రేవంత్(CM Revanth Reddy) వ్యాఖ్య‌ల‌పై ఈట‌ల స్పందించారు. కాళేశ్వ‌రం వంటి పెద్ద ప్రాజెక్టుల‌ను కేబినెట్ ఆమోదం లేకుండా ఏ ప్ర‌భుత్వం కూడా నిర్మించ‌ద‌ని ఈట‌ల రాజేంద‌ర్ అన్నారు.

Eatala Rajender | నిరూపిస్తే త‌ప్పుకుంటా..

మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌(Former CM KCR).. కేబినెట్‌లో చ‌ర్చించ‌కుండా ఏ నిర్ణయం తీసుకోలేద‌ని ఈట‌ల తెలిపారు. ఒక‌వేళ నిర్ణ‌యం తీసుకున్నా కేబినెట్ ఆమోదం తీసుకుంటార‌ని చెప్పారు. ఈ విష‌యం తాను బీజేపీ ఎంపీగా కాకుండా నాటి మంత్రిగా చెబుతున్నాన‌ని తెలిపారు. కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వ‌రం లాంటి అతిపెద్ద ప్రాజెక్టు క‌ట్టిన సంద‌ర్భం దేశంలో ఎక్క‌డైనా ఉందా? అని ప్ర‌శ్నించారు. ఇలాంటి కీల‌క‌మైన అంశాల‌పై కేబినెట్ ఆమోదం లేకుండా కేసీఆర్ ఎప్పుడూ నిర్ణ‌యాలు తీసుకోలేద‌ని చెప్పారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు బీఆర్​ఎస్ హ‌యాంలో ప్రారంభం కాలేద‌ని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడే ప్రాణ‌హిత చేవెళ్ల ప్రాజెక్టును ప్రారంభించింద‌ని చెప్పారు. ఇదే ప్రాజెక్టును రీ డిజైన్ పేరుతో అప్ప‌టి బీఆర్ఎస్ ప్ర‌భుత్వం(BRS government) కాళేశ్వ‌రం ప్రాజెక్టుగా మార్చి నిర్మించింది.

దీనిపై కేబినెట్‌లో చ‌ర్చించి ఆమోదించిన త‌ర్వాతే అప్ప‌టి ప్ర‌భుత్వం ముందుకెళ్లింద‌న్నారు. ఆనాడు కేబినెట్‌లో ఉన్న ముగ్గురు మంత్రులు ఇప్పుడు సీఎం ప‌క్క‌నే ఉన్నార‌ని, అవ‌స‌ర‌మైతే వారిని అడిగితే స్ప‌ష్టంగా చెబుతార‌ని రేవంత్‌రెడ్డికి కౌంట‌ర్ ఇచ్చారు. కాళేశ్వ‌రం విష‌యంలో త‌న‌పై త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని ఈట‌ల అన్నారు. కాళేశ్వ‌రం విచార‌ణ‌పై త‌న‌కు న‌మ్మకం లేద‌ని, దీనిపై సీబీఐతో విచార‌ణ(CBI Interrogation) జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు మ‌ర‌మ్మ‌తులు చేసి సాగునీరందించాల‌ని కోరారు. రేవంత్‌రెడ్డి చెబుతున్న‌ట్లు కేబినెట్ ఆమోదం లేకుండా కాళేశ్వ‌రం క‌ట్టిన‌ట్లు నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాల్ చేశారు.