Earthquake
Earthquake | గుజరాత్‌లో భూ ప్రకంపనలు.. భయంతో పరుగులు తీసిన ప్రజలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake | గుజరాత్​లో (Gujarat) గురువారం ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. కచ్‌ (Kach) ప్రాంతంలో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. రిక్టార్​ స్కేల్​పై భూకంప తీవ్రత 3.3గా నమోదైనట్లు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ (ISR) తెలిపింది. ఉదయం 9.52 గంటలకు ఈ భూకంపం నమోదైందని అధికారులు తెలిపారు. కచ్​ జిల్లాలోని బేలాకు 16 కి.మీ దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడించారు. భూకంపం కారణంగా ఎటువంటి ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. అయితే ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు.

Earthquake | తరచూ భూకంపాలు

గుజరాత్​లోని కచ్ జిల్లా భూకంపాలు ఎక్కువగా చోటు చేసుకునే జోన్​లో ఉంది. దీంతో అక్కడ తరచూ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే అందులో చాలా వరకు తక్కువ తీవ్రతతో ఉంటాయి. కానీ 2001లో కచ్‌లో భారీ భూకంపం (Kachchh Earthquake) వచ్చింది. గత రెండు శతాబ్దాలలో భారతదేశంలో మూడో అతి పెద్ద భూకంపం 2001లో కచ్​లో సంభవించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు జెండా ఎగుర వేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్న సమయంలో జనవరి 26న ఉదయం భారీ భూకంపం చోటు చేసుకుంది. రిక్టార్​ స్కేల్​పై 7.7 తీవ్రతో వచ్చిన ఈ భూకంపం గుజరాత్​లో పెను విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 13,800 మంది మరణించారు, 1.67 లక్షల మంది గాయపడ్డారు. వేల ఇళ్లు ధ్వంసం అయ్యాయి.