అక్షరటుడే, వెబ్‌డెస్క్: New Year Celebrations | హైదరాబాద్ నగరంలో (Hyderabad city) గంజాయి, డ్రగ్స్ దందా జోరుగా సాగుతోంది. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పలువురు డ్రగ్స్ పార్టీలు చేసుకోడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ లేకుండా చేస్తామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Hyderabad CP Sajjanar) హెచ్చరించారు. ఇటీవల నగరంలో డ్రగ్స్ దందా జోరుగా సాగుతుండటంతో ఆయన స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలో డ్రగ్స్ రవాణా చేసే వారిపై నిఘా ఉంచుతామని తెలిపారు. తాజాగా ఈగల్ టీమ్, ఎక్సైజ్ పోలీసులు నగరంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నానక్‌రామ్‌గూడలో గంజాయి పట్టుకున్నారు. 1.3 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని, అసోంకు చెందిన దిలీప్ కోచే అనే వ్యక్తిని అరెస్టు చేశారు.
New Year Celebrations | పబ్‌లపై మెరుపు దాడులు
నగరంలోని పబ్‌లు, హోటళ్లలో (pubs and hotels) కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే పలు పబ్‌లు, హోటళ్లలో డ్రగ్స్ వినియోగించే అవకాశం ఉందని సమాచారం అందింది. దీంతో ఈగల్ టీమ్ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పోలీసులతో కలిసి పబ్ లపై మెరుపు దాడులు చేసింది. క్వేక్ ఎరీనా పబ్‌లో 14 మందికి డ్రగ్ టెస్టులు చేయగా 8 మందికి పాజిటివ్ వచ్చింది. పట్టుబడిన వారిలో ముగ్గురు యువతులు, ఐదుగురు యువకులు ఉన్నారు. 10 రోజుల్లో 27 మంది డ్రగ్ పెడ్లర్లు, 17 మంది కస్టమర్లను అరెస్ట్ చేశారు.
ఐదుగురు నైజీరియన్ మహిళలను అదుపులోకి తీసుకున్న ఈగల్ టీమ్ (Eagle Team) 65 గ్రాముల కొకైన్, 50 గ్రాముల MDMA, 381 కేజీల గంజాయి స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్‌ను ప్రోత్సహిస్తే పబ్ ల లైసెన్సులు రద్దు చేస్తామని పోలీసుల హెచ్చరించారు.
New Year Celebrations | సరూర్ నగర్లో..
హైదరాబాద్ సరూర్ నగర్‌లోని రాఘవేంద్ర భవన్ హుడా కాలనీలో ఎక్సైజ్ పోలీసుల దాడి చేశారు. ఒడిశా నుంచి తీసుకొచ్చి గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 6.3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒడిశాకు చెందిన బెహన్ దూరే, జగన్నాథ్, డాల్ సరోజ్ జలారిగా గుర్తించారు. డిసెంబర్ 31 వరకు నగరంలో ప్రత్యేక తనిఖీలు చేపడుతామని అధికారులు తెలిపారు. డ్రగ్స్ విక్రయించినా.. కొనుగోలు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.