అక్షరటుడే, హైదరాబాద్: E-filing system : రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లక్ష్యాలను సాధించడంపై అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్ధేశం చేశారు. నిర్దిష్టమైన భవిష్యత్తు ప్రణాళికతో తెలంగాణను క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాల వారీగా సమగ్రమైన అభివృద్ధికి అన్ని విభాగాలు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆదేశించారు.
విజన్ డాక్యుమెంట్ కేవలం ప్రచారానికి పరిమితమనే అపోహను తిప్పికొట్టేలా, ప్రతి అంశంపై లక్ష్యాలను చేరుకోవడానికి ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేస్తే 2047 లక్ష్యాలను సులభంగా చేరుకోవచ్చన్నారు.
ప్రభుత్వంలోని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు, సీఎంఓ అధికారులతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి సమావేశమై దాదాపు ౩ గంటలకుపైగా సమీక్షించారు. రానున్న రోజుల్లో అనుసరించాల్సిన కార్యాచరణపై ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.
E-filing system : రైజింగ్ లక్ష్యాల సాధన దిశగా
“ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలో కొన్ని విజయాలు సాధించాం. మరికొన్ని అంశాల్లో భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకున్నాం. గతంలో విద్యుత్, విద్య, నీటిపారుదల, ఆరోగ్య లాంటి పలు శాఖలకు సంబంధించిన ఒక పాలసీ లేని కారణంగా కొన్ని సమస్యలొచ్చాయి. అందుకే ముఖ్యమైన విభాగాలకు ప్రత్యేకంగా పాలసీ తీసుకొచ్చాం.
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి స్పష్టమైన పాలసీ ఉండాలన్న ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను విడుదల చేశాం. రాష్ట్రాన్ని క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) ప్రాంతాలుగా విభజించి అభివృద్ధికి ప్రణాళికలు, విధివిధానాలతో ముందుకు వెళుతున్నాం.
లక్ష్యాలను సాధించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదు. పనితీరులో మార్పు రావాలి. ఇకపై కార్యదర్శులు ప్రతి నెల ప్రధాన కార్యదర్శికి నివేదికలు సమర్పించాలి. అందరి పనితీరుపై సమీక్ష నిర్వహిస్తా. ఐఏఎస్ అధికారులు ప్రతి పది రోజులకోసారి క్షేత్రస్థాయికి వెళ్లాలి. నెలలో కనీసం మూడు సార్లు తమ శాఖ పరిధికి సంబంధించి క్షేత్ర స్థాయి పరిశీలన చేయాలి.
శాఖల మధ్య, అధికారుల మధ్య సమన్వయం కోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. తెలంగాణ రైజింగ్ లక్ష్యాల సాధన దిశగా అన్ని విభాగాలు నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.
రాష్ట్రంలో ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో రెగ్యులర్, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన సుమారు 10 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఉద్యోగులకు సంబంధించిన పూర్తి వివరాలు జనవరి 26 లోగా ప్రధాన కార్యదర్శికి అందించాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు క్రమం తప్పకుండా అందాల్సిన జీతాలు, ఈపీఎఫ్ అందుతున్నాయో లేదో సంబంధిత శాఖల అధికారులు పరిశీలించాలి. ఉద్యోగాల డేటా విషయంలో అధికారులదే పూర్తి బాధ్యత.
రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగకూడదు. జనవరి 26 లోపు అద్దె భవనాల్లో ఉన్న కార్యాలయాలను ఖాళీ చేసి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భవనాల్లోకి మారాలి. ఖాళీ భవనాలు అందుబాటులో లేకపోతే ఖాళీ స్థలాలను గుర్తించి నిర్ణీత గడువులోగా సొంత భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేయాలి.
ప్రజలకు సేవలు అందించే కార్యాలయాలు పట్టణాల్లో అందరికీ అందుబాటులో ఉండేలా కొత్త భవనాలు నిర్మించాలి. ఇతర విభాగాలు, శాఖలకు చెందిన భవనాలుంటే వాటిని వినియోగించుకోవాలి. అద్దె భవనాల్లో ఉన్న ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ హాస్టళ్లు, అంగన్వాడీలు అన్నింటికీ సొంత భవనాలు ఉండేలా వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలి.
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల (సీఎస్ఎస్) నుంచి వచ్చే నిధులను అన్ని శాఖలు సద్వినియోగం చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు, వివిధ విభాగాలకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగులో ఉన్న అంశాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలి.
జనవరి 31 లోగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఈ -ఫైలింగ్ విధానం అమలు చేయాలి. కాగితాలు, ఫైళ్లు పట్టుకొని తిరిగే పరిస్థితి ఉండకూడదు. ఆయా శాఖల పరిధిలోని కార్యక్రమాల అమలుకు ప్రత్యేకంగా డాష్ బోర్డు సిద్ధం చేసి దాన్ని సీఎస్, సీఎంఓ డాష్ బోర్డుతో అనుసంధానం చేయాలి.
రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎంతమేరకు గ్రౌండయ్యాయి. వాటి పురోగతిని ప్రతి నెల సమీక్షించుకోవాలి. పరిశ్రమలకు అవసరమైన భూసేకరణ, భూ కేటాయింపులకు అవసరమైన మేరకు ప్రత్యేకంగా అధికారులను నియమించాలి.
కోర్ అర్బన్ ఏరియాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. కార్పొరేట్ తరహాలో సర్కారు స్కూళ్లలో నమోదు శాతం పెంచేందుకు రవాణా సదుపాయం, బ్రేక్ ఫాస్ట్, మిడ్ డే మీల్స్ అమలు దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలి.
రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కాలేజీలన్నింటిలోనూ టీచింగ్ హాస్పిటల్స్, అద్భుతమైన వైద్య సేవలు అందించేలా తీర్చిదిద్దాలి. నిమ్స్ తరహాలో సనత్నగర్, కొత్తపేట, అల్వాల్ టిమ్స్, వరంగల్ హాస్పిటల్స్, ఉస్మానియా కొత్త ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా ఉండాలి.” అని ముఖ్యమంత్రి ఆదేశించారు.