అక్షరటుడే, వెబ్డెస్క్: Lok Sabha | పార్లమెంట్ శీతాకాల సమావేశాలు (Parliament winter session) జరుగుతున్న నేపథ్యంలో లోక్సభలో ఈ-సిగరెట్ ధూమపానం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నేడు క్వశ్చన్ అవర్ సందర్భంగా బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ అనురాగ్ ఠాకూర్ (MP Anurag Thakur) సంచలన వ్యాఖ్యలు చేశారు.
తృణమూల్ కాంగ్రెస్కు చెందిన కొందరు మహిళా సభ్యులు లోక్సభ ప్రాంగణంలోనే ఈ-సిగరెట్లు తాగుతుండగా తాను స్వయంగా గమనించానని ఆయన అన్నారు. దేశంలో ఈ-సిగరెట్లపై (e-cigarettes) పూర్తి నిషేధం అమలులో ఉన్నప్పటికీ, దేశ చట్టసభలో ఇలాంటి ఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
“సభాభవనంలోనే కొంతమంది టీఎంసీ మహిళా ఎంపీలు గత కొన్ని రోజులుగా నిరంతరంగా ఈ-సిగరెట్లు తాగుతూ కనిపిస్తున్నారు. ఇది సభా నియమాలకు పూర్తి వ్యతిరేకం” అని అనురాగ్ ఠాకూర్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన స్పీకర్ ఓం బిర్లాను ఉద్దేశించి, “సభలోకి ఈ-సిగరెట్లకు అనుమతి ఇచ్చారా?” అని అడిగారు.
దీనిపై స్పందించిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. “సభలో ధూమపానం నేరం. ఈ-సిగరెట్లకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వలేదు” అని ఆయన ప్రకటించారు. రాతపూర్వక ఫిర్యాదు అందితే సంబంధిత సభ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదనంగా సభలోని అందరు సభ్యులను ఉద్దేశించి, “ఇకపై ఎవరైనా సభలో ధూమపానం చేస్తూ కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించారు.
2019లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ప్రొహిబిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ యాక్ట్’ ద్వారా దేశవ్యాప్తంగా ఈ-సిగరెట్లపై పూర్తి నిషేధం అమలులో ఉంది. ఈ చట్టం ఉల్లంఘిస్తే కఠిన శిక్షలు విధిస్తారు. అటువంటి నిషేధం ఉన్నప్పటికీ పార్లమెంటు ఆవరణలోనే ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.