Chain Snatchers
Chain Snatchers | చైన్‌ స్నాచర్లను పట్టించిన ఈ–చలాన్‌

అక్షరటుడే, కామారెడ్డి: Chain Snatchers | బైక్‌పై ఉన్న ఈ–చలానాతో చైన్‌ స్నాచర్లు (chain snatchers) పోలీసులకు చిక్కిన ఘటన కామారెడ్డి పట్టణంలో జరిగింది. ఈ మేరకు శనివారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో కామారెడ్డి సబ్‌ డివిజన్‌ ఏఎస్పీ చైతన్యరెడ్డి (ASP Chaitanya Reddy) కేసు వివరాలు వెల్లడించారు. ఈనెల 18న పట్టణంలోని గాంధీనగర్‌లో అనసూయ అనే మహిళ మెడలో నుంచి ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి అపహరించుకుపోయారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీ ఆధారంగా బైక్‌ నంబర్‌ లభించింది. కాగా, సదరు బైక్‌పై ఈ–చలానా (e-challan) ఉండగా, దాని ఆధారంగా రామేశ్వర్‌పల్లికి చెందిన భాస్కర్‌ రెడ్డిని నిందితుడిగా గుర్తించారు. ఈ మేరకు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, బాబాగౌడ్‌ అనే వ్యక్తితో కలిసి చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. శనివారం ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి 3 తులాల బంగారు గొలుసు, బైక్, ఫోన్‌ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పట్టణ సీఐ నరహరి, ఎస్సై నరేష్, సిబ్బంది పాల్గొన్నారు.