అక్షరటుడే, కామారెడ్డి: Shabbir Ali | పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో (BRS) దోపిడీ తప్ప అభివృద్ధి ఊసే లేదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ విమర్శించారు. భిక్కనూరు (Bhiknoor) మండలంలోని రైల్వే స్టేషన్ (Railway Station) గ్రామంలో సోమవారం సాయంత్రం పల్లె పనుల జాతర (Panula Jathara) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రూ.20లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Housing Scheme) లబ్ధిదారులకు మంజూరు పత్రాలు, ఆహార భద్రత కార్డులు పంపిణీ చేపట్టారు.
అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో పలువురికి 60 లక్షల రూపాయల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ (CMRF) చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణలో గ్రామ గ్రామాన పనుల జాతర కార్యక్రమాలు జరుగుతున్నాయని, పల్లెలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నాయన్నారు.
బీఆర్ఎస్ పాలనలో గ్రామపంచాయతీ ఏర్పాటు చేసి పంచాయతీ కార్యాలయాలు గాలికి వదిలేశారన్నారు. గతంలో గ్రామాల్లో ఉన్న సమస్యలు చెప్పుకుందామంటే నాయకుల జాడే కనపడలేదని, ఎవరైనా సమస్యలు చెప్పుకుందామంటే లంచాలతో పనులు చేస్తూ బెదిరింపులతో సమాధానం చెప్పేవారన్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క రేషన్ కార్డు రాలేదని, పేదలకు ఇల్లు రాలేదని, బీఆర్ఎస్ నాయకులు మాత్రం లక్షాధికారులయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వమని.. వారి అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. అప్పులు చేసి ఆస్పత్రిపాలైన వారికి గతంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదవారికి ఆసరాగా నిలుస్తోందని చెప్పారు.