
అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Asia Cup | ఆసియా కప్ 2025లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక జట్టు ఆఫ్ఘనిస్థాన్(Afghanistan)పై విజయాన్ని అందుకుంది. కానీ ఈ గెలుపు శ్రీలంక ఆటగాళ్ల ముఖంపై చిరునవ్వులు చిందించలేకపోయింది.
జట్టులోని యువ ఆల్‌రౌండర్ దునిత్ వెల్లలాగే కు ఎదురైన వ్యక్తిగత విషాదంతో శ్రీలంక ఆటగాళ్లు విజయాన్ని అంతగా ఆస్వాదించలేకపోయారు. అబుదాబి(Abudabi)లో మ్యాచ్ ముగిసిన వెంటనే, దునిత్ వెల్లలాగేకు తండ్రి సురంగ వెల్లలాగే మరణవార్త తెలియజేయడంతో చాలా ఎమోషనల్ అయ్యారు. మ్యాచ్ సమయంలో ఆయన గుండెపోటుతో కన్నుమూశారు. అయితే ఈ విషయం ముందుగానే చెప్పి తన ఆటపై ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని దునిత్‌కి మ్యాచ్ పూర్తయ్యే వరకు దాచేశారు.
Asia Cup | తీవ్ర విషాదం..
మ్యాచ్ గెలిచిన అనంతరం, శ్రీలంక కోచ్ సనత్ జయసూర్య స్వయంగా మైదానంలోకి వచ్చి దునిత్(Dunith) భుజంపై చేయి అతనిని ఓదారుస్తూ ఈ విషాద వార్త తెలియజేశాడు. అయితే ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి గురైన దునిత్ మైదానం వీడాడు. దునిత్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రీడాభిమానులు కూడా చలించి ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నన్ను ఆంతరంగికంగా తాకింది అంటూ రసెల్ ఆర్నాల్డ్ స్పందించారు. కామెంటరీ బాక్స్‌లో ఉన్న మాజీ క్రికెటర్ రసెల్ ఆర్నాల్డ్ స్పందిస్తూ, సురంగ వల్లలాగే కూడా ఒక మంచి క్రికెటర్. నేను స్కూల్ జట్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఆయన ‘ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజ్’ జట్టుకు నాయకత్వం వహించారు. ఈ వార్త చాలా బాధాకరం. దునిత్‌కు నా ప్రగాఢ సానుభూతి,” అన్నారు.
మ్యాచ్‌లో దునిత్ ఫెర్ఫార్మెన్స్ చూస్తే.. బౌలింగ్‌లో అంత ప్రభావం చూపలేకపోయాడు. నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్ 49 పరుగులు ఇచ్చాడు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ నబీ దునిత్ బౌలింగ్‌లో ఐదు సిక్సర్లు బాదడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుత విజయంతో శ్రీలంక కూడా సూపర్ 4కి చేరింది. సూపర్ 4లో శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి.