అక్షరటుడేర, వెబ్‌డెస్క్: Kaantha Movie | పేరుకి తమిళ హీరో అయినా తెలుగులో తనకంటూ ప్రత్యేక అభిమానగణాన్ని ఏర్పరచుకున్నాడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). ‘మహానటి’, ‘సీతారామం’ వంటి చిత్రాల విజయంతో ఆయనకు స్ట్రెయిట్ తెలుగు హీరోలతో పోలిస్తే మరింత క్రేజ్ దక్కింది అని చెప్పాలి. ఈ మధ్య లక్కీ భాస్కర్ అనే చిత్రంతోనూ ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు.
ఇక తాజాగా కాంత చిత్రంతో (Kaantha Movie) ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ప్రముఖ నటుడు రానా ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఈ మూవీ ఒక పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ కలిగిన కథాంశంతో తెరకెక్కుతోంది. గతంలో ‘మహానటి’లో శివాజీ గణేషన్ పాత్రలో కనిపించిన దుల్కర్, తన నటనతో ఎంతగా ఆకట్టుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ‘కాంత’ చిత్రంలోనూ 1960ల కాలం నాటి స్టార్ హీరోగా కనిపించి సందడి చేయబోతున్నాడు.
Kaantha Movie | ఇంట్రెస్టింగ్‌గా..
‘కాంత’ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్(Heroine Bhagyashree Borse)గా కనిపించనుండగా, ప్రముఖ దర్శక నటుడు సముద్రఖని (Samudra Khani) ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పీరియాడికల్ డ్రామాను హీరో రానా దగ్గుబాటి, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన దుల్కర్ మరియు భాగ్యశ్రీ ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి స్పందన లభించింది. దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా జూలై 28న సినిమా టీజర్‌ను (Movie Teaser) విడుదల చేశారు. 1950ల మద్రాస్ నాటి పూర్వాపరాలను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో దుల్కర్, భాగ్యశ్రీలు తమ పాత్రల్లో రియలిస్టిక్‌గా కనిపించారు. సముద్రఖని మాత్రం ఒక దర్శక రచయిత పాత్రలో నటిస్తున్నారు. ‘శాంత’ అనే టైటిల్‌తో సినిమా తీయాలనుకున్న డైరెక్టర్, హీరో మధ్య జరిగే ఈగో క్లాష్ చుట్టూ కథ సాగుతున్నట్లు టీజర్ బట్టి అర్థమవుతోంది.
ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే దుల్కర్, సముద్రఖనిల మధ్య ఏ వివాదం చోటు చేసుకుంది? వారి ప్రయాణంలో వచ్చిన మలుపులేంటి? అనే అంశాల నేపథ్యంగా చిత్రం రూపొందినట్టు తెలుస్తుంది. చూస్తుంటే ఈ చిత్రం కూడా మహానటి తరహాలో ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుందని అర్ధమవుతుంది. మరి తాజాగా విడుదలైన టీజర్‌పై మీరు ఓ లుక్కేయండి.