అక్షరటుడే, వెబ్‌డెస్క్: DTC officer Kishan Naik | అక్రమాస్తుల కేసులో మహబూబ్‌నగర్ జిల్లా డీటీసీ కిషన్ నాయక్ ఏసీబీకి చిక్కడం, అతని వందల కోట్ల ఆస్తులు గుర్తించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే కిషన్ నాయక్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన ఏసీబీ అధికారులు తదుపరి దర్యాప్తును ముమ్మరం చేశారు.
DTC officer Kishan Naik | ఆది నుంచి తీవ్ర అవినీతి ఆరోపణలు
మహబూబ్‌నగర్ డీటీసీగా పనిచేస్తున్న కిషన్ నాయక్‌పై మొదటి నుంచి తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా రూ. వందల కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీకి వరుస ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో గత కొద్దిరోజులుగా నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలు సేకరించి కిషన్ నాయక్ ఇంట్లో సోదాలు చేపట్టారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని బోయిన్పల్లి, ఆర్‌ఆర్‌నగర్‌లోని కిషన్ నాయక్ నివాసాలతో పాటు నిజామాబాద్ జిల్లాలోనూ సోదాలు చేపట్టారు. మొత్తంగా బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం.. రూ. 250కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ గుర్తించింది.
DTC officer Kishan Naik | నిజామాబాద్ ఆస్తులపై చర్చ
నిజామాబాద్‌లోని బైపాస్ రోడ్డులో గల హెూటల్ లహరి ఇంటర్నేషనల్‌లో 50 శాతం వాటా కిషన్ నాయక్‌కు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. అలాగే దీనికి ఆనుకుని ఉన్న రాయల్ ఓక్ స్థలం 3వేల గజాలు మొత్తం కూడా కిషన్ నాయక్దేనని తేల్చారు. అశోక్ టౌన్ షిప్లో రెండు ఫ్లాట్లు, నిజామాబాద్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో కమర్షియల్ ల్యాండ్ పది ఎకరాల మేర గుర్తించారు. అయితే లహరి హోటల్, అశోక టౌన్ షిప్, రాయల్ ఓక్ ఇవన్నీ కూడా ప్రముఖ బిల్డర్లకు చెందినవి. దీంతో సదరు అశోక టౌన్ షిప్‌లోనూ కిషన్ నాయక్‌కు వాటాలు ఉన్నట్లు తెలుస్తోంది. సదరు బిల్డర్లతో కలిసి స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటూ రియల్ ఎస్టేట్ దందా సాగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఈ కోణంలోనూ ఏసీబీ అధికారులు విచారణ మొదలుపెట్టారు.
DTC officer Kishan Naik | పదెకరాల స్థలం ఎక్కడ..?
ఏసీబీ అధికారుల సోదాల్లో కిషన్‌నాయక్‌కు సంబంధించి నిజామాబాద్ నగర శివార్లలో పది ఎకరాల మేర కమర్షియల్ స్థలం ఉన్నట్లు గుర్తించారు. కాగా.. ఈ స్థలం ఎక్కడ ఉంది..? ఇందులో ఎవరెవరు వాటాదారులు ఉన్నారు..? ప్రస్తుతం వివిధ శాఖల్లో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుపుతున్న అధికారులతో కలిసి కిషన్ నాయక్ భాగస్వామిగా మారాడా..? అనే రకరకాల చర్చోపచర్చలు తెరపైకి వస్తున్నాయి. కాగా.. బైపాస్ రోడ్డులో సైతం కిషన్ నాయక్‌కు ఖరీదైన స్థలాలు ఉన్నట్లు తెలుస్తోంది.