అక్షరటుడే, వెబ్‌డెస్క్: ACB Case | ఆదాయానికి మించి ఆస్తుల కేసులో డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్ కిషన్ నాయక్‌కు కోర్టు రిమాండ్ విధించింది. అధికారులు ఏసీబీ కోర్టు (ACB Court)లో హాజరు పర్చడంతో 14 రోజుల రిమాండ్ విధించింది.
అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు (ACB Officers) మంగళవారం మహబూబ్‌నగర్ డీటీసీ కిషన్ నాయక్ నివాసాల్లో సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నిజామాబాద్ (Nizamabad)లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేపట్టారు. సోదాల సందర్భంగా కిషన్ నాయక్ భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు గర్తించారు. ఈ మేరకు బుధవారం నిందితుడిని కోర్టులో హాజరు పర్చగా జడ్జి రిమాండ్ విధించారు. దీంతో చంచల్‌గూడ జైలు (Chanchalguda Jail)కు తరలించారు.
ACB Case | బినామీగా డ్రైవర్
దాదాపు 17 గంటలకుపైగా కిషన్ నాయక్ (Kishan Naik) ఇంట్లో సోదాలు చేపట్టారు. కొన్ని కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. కిషన్ నాయక్‌కి చెందిన బంగారం, బ్యాంక్ ఖాతాలోని నగదు సీజ్ చేశారు. కిషన్ నాయక్‌తో పాటు అతడి బంధువులు, స్నేహితుల ఇళ్లలో సైతం అధికారులు సోదాలు చేపట్టారు. నేడు కిషన్ నాయక్ బ్యాంకు లాకర్లను ఏసీబీ తెరిచే అవకాశం ఉంది. అలాగే కిషన్ నాయక్ డ్రైవర్ శివశంకర్‌ను బినామీగా పెట్టుకున్నట్లు సమాచారం. నగదు, స్థలాలు శివశంకర్ పేరిట ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. కాగా ఏసీబీ దాడుల నేపథ్యంలో శివశంకర్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం అధికారులు గాలిస్తున్నారు.
ACB Case | డీటీసీ ఆస్తుల వివరాలు
నిజామాబాద్ నగరంలోని ప్రముఖ హోటల్ లహరీ (Hotel Lahari)లో డీటీసీ కిషన్ నాయక్‌కు 50 శాతం వాటా ఉంది. ఆ హోటల్ పక్కనే ఉన్న రాయల్ ఓక్ ఫర్నిచర్ భవనం (Royal Oak Furniture Building) ఆయనదే. నిజామాబాద్ నగరంలోని అశోక టౌన్షిప్లో రెండు ప్లాట్లు, సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 10 ఎకరాల వాణిజ్య భూమి ఉంది. బ్యాంక్ అకౌంట్లో రూ.1.37 కోట్లు, ఇంట్లో కిలో బంగారం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతడి పేరుపై హోండా సిటీ, ఇన్నొవా క్రిస్ట కార్లు ఉన్నాయి.