అక్షరటుడే, వెబ్డెస్క్ : Hyderabad | హైదరాబాద్ (Hyderabad) నగరంలో నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. వీటిలో చాలా వరకు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతోనే చోటు చేసుకుంటున్నాయి. వీకెండ్ వచ్చింది అంటే చాలు మందు బాబులు రెచ్చిపోతున్నారు. దీంతో సైబరాబాద్ (Cyberabad) ట్రాఫిక్ పోలీసులు (Traffic Police) వారాంతంలో ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు.
నగరంలో శనివారం స్పెషల్ డ్రంకన్ డ్రైవ్ (Drunk n Drive) తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 120 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ దొరికారు. వారిలో ద్విచక్ర వాహనదారులు 71 మంది, నాలుగు చక్రాల వాహనాలు నడిపే వారు 43 మంది, ఆటో రిక్షా డ్రైవర్లు నలుగురు, హెవీ వెహికల్ డ్రైవర్లు ఇద్దరు ఉన్నారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరుస్తామన్నారు.
Hyderabad | 26 రోజుల్లో 1,318 కేసులు
హైదరాబాద్ నగరంలో జులై (July) ప్రారంభం నుంచి 26వ తేది వరకు మొత్తం 1,318 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. ఇందులో 38 మందికి జైలు శిక్ష పడింది. మద్యం మోతాదు, గతంలో దొరికిన సందర్భాలను బట్టి న్యాయమూర్తి జైలు శిక్ష వేస్తారు. ఒక్క రోజు నుంచి ఏడు రోజుల వరకు శిక్ష పడినట్లు పోలీసులు వెల్లడించారు. 31 మందికి సమాజ సేవ చేయాలని పనిష్మెంట్ విధించారు.
రోడ్డు ప్రమాదాలు (Road Accidents) నివారించడానికి హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడంతోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నారు. నిత్యం డ్రంకన్ డ్రైవ్ టెస్టులు చేపట్టడటంతో పాటు శని, ఆదివారాల్లో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. అంతేగాకుండా పగటి పూట కూడా తనిఖీలు (Drunk driving checks) చేపడుతున్నారు. గతంలో సాయంత్రం తర్వాత మాత్రమే డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేసేవారు. అయితే కొందరు పగలు కూడా మందు తాగి వాహనాలు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పగటి పూట ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు.