అక్షరటుడే, కామారెడ్డి: Demo Train | మద్యం మత్తులో రైలు పట్టాలపై ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. ఈ ఘటన జిల్లా కేంద్రంలోని రైల్వేగేట్ (railway Gate) సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఆదివారం రాత్రి సుమారు 8:30 గంటల ప్రాంతంలో అశోక్‌నగర్ రైల్వేగేట్ (Ashoknagar Railway Gate) వద్ద కరీంనగర్ (karimnagar) నుంచి కాచిగూడ (kachiguda) వైపు వెళ్తున్న డెమో రైలు (Demo train) వచ్చింది. దీంతో రైల్వే సిబ్బంది గేటు వేశారు. అదే సమయంలో మద్యం మత్తులో నలుగురు మేస్త్రీలు గేటు దాటారు. రైలు నెమ్మదిగా వెళ్తున్న సమయంలో మల్యాద్రి అనే మేస్త్రికి తగిలింది. దాంతో మల్యాద్రి ముఖానికి గాయాలయ్యాయి.
Demo Train | నన్నే రైలు ఢీకొడుతుందా అంటూ.. రైలుకు ఎదురెళ్లి..
నన్నే రైలు ఢీకొడుతుందా అంటూ ఆగ్రహించిన మల్యాద్రి రైలు వెంబడి పరిగెడుతూ వెళ్లి రైలుకు ఎదురుగా పట్టాలపై కూర్చొని హల్చల్ సృష్టించాడు. గమనించిన లోకో పైలట్ రైలును నిలిపివేశాడు. సుమారు 20 నిమిషాల పాటు రైలు నిలిచిపోయింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు రైల్వే అధికారులకు సమాచారం చేరవేశారు. పోలీసులు, రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రైలు పట్టాలపై నుంచి మల్యాద్రిని పక్కకు తీసుకెళ్లారు. అనంతరం గాయపడ్డ మల్యాద్రిని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు (kamareddy GGH) తరలించారు. ఈ విషయమై రైల్వే అధికారులను సంప్రదించగా మాల్యాద్రి అనే వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు తెలిపారు.