Homeతాజావార్తలుHyderabad | డాక్టర్​ ఇంట్లో డ్రగ్స్​ డెన్​.. నలుగురిపై కేసు

Hyderabad | డాక్టర్​ ఇంట్లో డ్రగ్స్​ డెన్​.. నలుగురిపై కేసు

తన ఇంటినే డ్రగ్స్​ డెన్​గా మార్చాడో డాక్టర్​. ముగ్గురు స్నేహితులతో కలిసి నగరంలో దందా నిర్వహిస్తున్నాడు. ఎక్సైజ్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు తనిఖీలు చేపట్టి నిందితుడిని అరెస్ట్​ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | మాదకద్రవ్యాలతో కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఓ వైద్యుడు డ్రగ్స్​ వ్యాపారం చేస్తున్నాడు. తన ఇంటినే డ్రగ్స్​ డెన్​గా మార్చి దందా కొనసాగిస్తున్నాడు. ఈ ఘటన హైదరాబాద్​ (Hyderabad)లో చోటు చేసుకుంది.

ముషిరాబాద్ (Mushirabad)లో ఓ డాక్టర్ ఇంట్లో డ్రగ్స్ డెన్ ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్​ టాస్క్​ఫోర్స్​ పోలీసులు దాడులు చేపట్టారు. డాక్టర్ జాన్పాల్ (Dr. John Paul) ఇంట్లో ఆరు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ముషీరాబాద్​కు చెందిన ఆయన అద్దెకు ఉంటున్న ఇంట్లోనే ముగ్గురు స్నేహితులు ప్రమోద్, సందీప్, శరత్‌తో కలిసి డ్రగ్స్ దందాను ప్రారంభించాడు. ఢిల్లీ, బెంగళూరు, గోవా నుంచి మాదకద్రవ్యాలు తెప్పించి నగరంలో విక్రయాలు చేపడుతున్నాడు. ప్రమోద్, సందీప్, శరత్ అనే స్నేహితులతో జాన్​పాల్ డ్రగ్స్​ తెప్పిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

Hyderabad | భారీగా డ్రగ్స్​ స్వాధీనం

డాక్టర్​ డ్రగ్స్​ దందా చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఎక్సైజ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై బాలరాజు (Task Force SI Balaraju) ఆధ్వర్యంలో జాన్‌పాల్ ఇంట్లో సోదాలు చేశారు. 26.95 గ్రాముల ఓజీ కుష్, 15 ఎల్ఎస్‌డీ బ్లాట్స్, 6.21 గ్రాముల ఎండీఎంఏ, 1.32 గ్రాముల కొకైన్, 5.80 గ్రాముల గుమ్మస్, 0.008 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.3 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు ప్రధాన నిందితుడు జాన్​పాల్​ను అరెస్ట్ చేశారు. అతడి స్నేహితులు ప్రమోద్, సందీప్, శరత్ పరారీలో ఉండగా.. వారి కోసం గాలిస్తున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కాగా నగరంలో పలువురు వైద్యులు డ్రగ్స్​కు బానిసలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే ఇటీవల ఓ వైద్య కాలేజీ (Medical College)కి చెందిన పలువురు విద్యార్థులు సైతం గంజాయి కొనుగోలు చేస్తూ దొరికారు. గంజాయి, డ్రగ్స్​తో కలిగే అనర్థాలపై పూర్తిగా అవగాహన ఉన్న వైద్యులు సైతం డ్రగ్స్​కు బానిసలుగా మారుతుండటం గమనార్హం. తాజాగా ఏకంగా ఓ డాక్టరే డ్రగ్స్​ దందా చేస్తూ దొరికిపోవడం ఆందోళన కలిగిస్తోంది.