అక్షరటుడే, వెబ్డెస్క్ : Guvvala Balaraju | తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యవహారంలో తాను సూత్రధారిని కానని, కేవలం పాత్రధారిని మాత్రమేనని వెల్లడించారు. అక్కడ ఏం జరుగుతుందో వెళ్లి చూడమంటేనే తాను వెళ్లాలని, ఎమ్మెల్యేల కొనుగోలు(MLAs Purchase) అంశంలో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు రాజీనామా చేసిన గువ్వల బాలరాజు.. మంగళవారం తనను కలిసిన విలేకరులతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Guvvala Balaraju | జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని..
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) రాజీనామా చేశానని, వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గువ్వల తెలిపారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలోనే తాను జాతీయ రాజకీయాల (National Politics) వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. తన రాజీనామాకు కాళేశ్వరం నివేదికతో సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. కాళేశ్వరం నివేదిక (Kaleshwaram Report) బయటకు వచ్చాకే రాజీనామా చేశారన్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఈ నెల 2వ తేదీనే తాను రాజీనామా చేశానని వెల్లడించారు. మరోవైపు, బీఆర్ ఎస్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై తాను ఎక్కడా, ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.
Guvvala Balaraju | అనుచరులతో చర్చించాకే నిర్ణయం..
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు గురించి విలేకరులు ప్రశ్నించగా, దాంతో తనకు సంబంధం లేదని గువ్వల బదులిచ్చారు. అందులో తాను సూత్రధారిని కానని, కేవలం పాత్రధారిని మాత్రమేనని వెల్లడించారు. కేసీఆర్(KCR) అక్కడ ఏం జరుగుతుందో వెళ్లి చూడమంటేనే తాను చూసేందుకు వెళ్లానని చెప్పారు. ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పిన గువ్వల.. కాంగ్రెస్లోకి రావాలని పెద్దపెద్ద నేతలు అడుగుతున్నారని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) కూడా తన నియోజకవర్గానికి చెందిన వారేనని గుర్తు చేశారు. తన అనుచరులతో చర్చించాక, నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల మేరకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.
Guvvala Balaraju | బీజేపీ వైపు అడుగులు..!
అనేక సమస్యలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) షాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తూ కేసీఆర్‌కు లేఖ రాశారు. ఎంతో ఆలోచించి, ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత బాధతో పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు కేసీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. బీఆర్ఎస్‌ను వీడిన గువ్వల బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా కాషాయ గూటికి చేరనున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 10న వారు బీజేపీ తీర్థం పుచ్చుకోన్నట్లు ప్రచారం జరుగుతోంది.