అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Double Registration | అధికారుల అవినీతితో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. లంచం తీసుకొని పలువురు అధికారులు అక్రమార్కులకు సహకరిస్తుండటంతో ప్రజలు నష్టపోతున్నారు.
ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో ఓ సబ్ రిజిస్ట్రార్ రూ.7 లక్షల లంచం తీసుకొని ఓ భూమిని డబుల్ రిజిస్ట్రేషన్ చేశాడు. ఇప్పటికే ఇతరుల పేరుపై ఉన్న భూమిని డబ్బులు తీసుకొని మరొకరి పేరిట పట్టా చేశాడు. దీంతో బాధితుడు పోలీసులు ఆశ్రయించడంతో సబ్ రిజిస్ట్రార్ (Sub-Registrar)తో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.
Double Registration | అక్రమార్కులతో కుమ్మక్కు
ఇటీవల భూముల ధరలు పెరగడంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నారు. అంతేగాకుండా ప్రైవేట్ వ్యక్తుల స్థలాలను కూడా వదలడం లేదు. అక్రమార్కుల ఆగడాలను అరికట్టాల్సిన పలువురు అధికారులు వారితోనే కుమ్మక్కు అవుతున్నారు. ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ రూ.7 లక్షల లంచం తీసుకొని ఓ ప్రైవేట్ ల్యాండ్‌ను డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి 2011లో దస్నాపూర్ శివారులోని ఎంప్లాయిస్ కాలనీలో ప్లాట్లు కొనుగోలు చేశాడు. గతేడాది సబ్ రిజిస్ట్రార్ దుప్పలపూడి అశోక్‌ను మచ్చిక చేసుకొని పెయింటర్ సంజీవ్ సహకారంతో నిందితులు డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నకిలీ పత్రాలతో (Fake Documents) ఏడు ప్లాట్లను సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్ చేశాడు. దీని కోసం ఆయన రూ.7 లక్షల లంచం తీసుకున్నాడు. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న నిందితులు మొదట ప్లాట్లు కొనుగోలు చేసిన వ్యక్తిని బెదిరించి కబ్జా చేశారు. దీంతో బాధితుడు జులైలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Double Registration | ముగ్గురి అరెస్ట్
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు. మావల మాజీ సర్పంచ్ ఉష్కం రఘుపతి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ నానం వెంకటరమణ, రిమ్స్ ఆయుష్ విభాగం ఉద్యోగి బేజ్జవార్ సంజీవ్ కుమార్ కలిసి కబ్జా చేసినట్లు గుర్తించారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్ట్రార్ దుప్పలపూడి అశోక్ ప్రస్తుతానికి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.