అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. దీంతో చాలా మంది ఆశావహులు పోటీకి ప్రయత్నాలు ప్రారంభించారు. వారికి మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ (Etala Rajender) కీలక సూచనలు చేశారు.
స్థానిక ఎన్నికల్లో (Elections) పోటీ చేసే అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని ఆయన సూచించారు. ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. తొందరపడి దసరాకు ప్రజలకు దావాత్లు ఇవ్వొద్దని ఆయన హెచ్చరించారు. స్థానిక ఎన్నికలు న్యాయపరంగా చెల్లుబాటు అవుతాయో కావోనని ఆయన పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations)ను కోర్టు కొట్టేస్తే ఎలా అని ఆయన అన్నారు. గతంలో మహారాష్ట్రలో ఎన్నికలు పూర్తయ్యాక కూడా కోర్టు రద్దు చేయడంతో అభ్యర్థులు నష్టపోయారని ఈటల గుర్తు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతోందని ఆయన విమర్శించారు.
Local Body Elections | అభ్యర్థుల్లో ఆందోళన
స్థానిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహులు పోటీకి సిద్ధం అవుతున్నారు. రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో ఆయా గ్రామాల్లో పోటీకి పలువురు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొంతమంది ఎప్పటి నుంచో ప్రజల్లో ఉంటూ డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం దసరా పండుగ ఉండటంతో ఆశావహులను అనుచరులు దావాత్లు అడిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. చాలా మంది ఇప్పటికే రూ.లక్షలు ఖర్చు చేశారు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ మరింత ఆలస్యం అయితే ఎలా అని ఆశావహులు చర్చించుకుంటున్నారు.
Local Body Elections | హైకోర్టులో రిజర్వేషన్ల అంశం
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తూ ప్రభుత్వం జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ జీవోను సవాలు చేస్తూ ఇప్పటికే పలువురు హైకోర్టు (High Court)ను ఆశ్రయించారు. దీనిపై విచారణను కోర్టు అక్టోబర్ 8కి వాయిదా వేసింది. నోటిఫికేషన్ వచ్చినా కూడా విచారణ చేపడుతామని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు కోర్టు జీవోను రద్దు చేస్తే ఎంటని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇదే అంశంపై అభ్యర్థులను ఈటల హెచ్చరించారు. కోర్టు జీవోను కొట్టేస్తే రిజర్వేషన్లు మారుతాయి. దీంతో ఎన్నికల కథ మళ్లీ మొదటికి వస్తుంది. ఒక వేళ కోర్టు ఓకే చెప్పినా.. పిటిషన్‌దారులు సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. రిజర్వేషన్లు 50శాతానికి మించకూడదని గతంలో సుప్రీంకోర్టు పేర్కొంది. దీంతో ఎన్నికలు ముగిశాక కూడా సుప్రీంకోర్టు (Supreme Court) రద్దు చేసే అవకాశం ఉందని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో ఆశావహులు ఎలా ముందుకు వెళ్లాలని ఆందోళన చెందుతున్నారు.