HomeUncategorizedDonald Trump | మాతో ఆట‌లాడొద్దు.. బ్రిక్స్ దేశాల‌కు ట్రంప్ హెచ్చ‌రిక‌..

Donald Trump | మాతో ఆట‌లాడొద్దు.. బ్రిక్స్ దేశాల‌కు ట్రంప్ హెచ్చ‌రిక‌..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Donald Trump | డాల‌ర్ ఆధిప‌త్యాన్ని స‌వాల్ చేసే వారు త‌గిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) హెచ్చ‌రించారు. అమెరికా ఆధిప‌త్యానికి గండికొట్టేందుకు బ్రిక్స్ చేసే ప్ర‌య‌త్నాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌మ‌తో ఆటలాడొద్ద‌ని, అలా చేస్తే వారు కనుమ‌రుగ‌వుతార‌ని వ్యాఖ్యానించారు. బ్రిక్స్(Bricks) కూటమితో పొత్తు పెట్టుకున్న దేశాలకు తీవ్ర హెచ్చరిక జారీ చేసిన ఆయ‌న‌.. వారు అమెరికా డాలర్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకునే ప్రయత్నాలను కొనసాగిస్తే అదనంగా 10 శాతం సుంకం విధిస్తామని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. శ్వేతసౌధంలో జరిగిన కొత్త క్రిప్టో కరెన్సీ చట్టం(Cryptocurrency Law)పై సంతకం చేసే కార్యక్రమంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Donald Trump | డాల‌ర్ కు గండికొట్టే ప్ర‌య‌త్నాలు..

బ్రిక్స్ దేశాల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ట్రంప్‌.. అదో చిన్న కూట‌మి అని అభివ‌ర్ణించారు. తాము బ‌ల‌మైన దెబ్బ కొట్టామ‌ని, అది చాలా వేగంగా ఉనికి కోల్పోతోంద‌న్నారు. డాల‌ర్ ఆధిప‌త్యానికి గండి కొట్టాల‌ని వారు (బ్రిక్స్‌) చూస్తున్నార‌ని, ఆ ప్ర‌య‌త్నాల‌ను అడ్డుకుంటామ‌ని చెప్పారు. డాల‌ర్‌కు గ్లోబ‌ల్ రిజ‌ర్వ్(Global Reserve) హోదా ఉంద‌న్న ట్రంప్‌.. దాని ఆధిప‌త్యాన్ని ఎప్ప‌టికీ త‌గ్గ‌నివ్వ‌బోమ‌ని స్ప‌ష్టం చేశారు. “వారు డాలర్‌ను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాలనుకున్నారు. “మేము అలా జరగనివ్వబోమని” అన్నారు. డిజిటల్ ఆస్తులను నియంత్రించడంపై రూపొందించిన ఈ చట్టంపై సంత‌కం చేసే కార్య‌క్ర‌మాన్ని ఉపయోగించుకుని, అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ట్రంప్‌ స్పష్టమైన సందేశం పంపారు.

Donald Trump | కూట‌మిపై ఆగ్ర‌హం..

ప‌ర‌స్ప‌ర స‌హ‌కారం కోసం ఏర్పాటైన కూట‌మే బ్రిక్స్‌. ఈ కూట‌మిలో తొలుత బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా ఉండ‌గా, త‌ద‌నంత‌రం విస్త‌రించింది. ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈలు కూడా ఇందులో చేరాయి. ప్ర‌పంచాన్ని శాసిస్తున్న అమెరికా డాలర్‌(US Dollar)పై ఆధారపడటాన్ని తగ్గించడానికి స్థానిక కరెన్సీలను వాణిజ్య పరిష్కారాలలో ఉపయోగించడంపై ఈ కూటమి ప్ర‌య‌త్నాలు చేస్తోంది. డాల‌ర్‌కు ప్రత్యామ్నాయ క‌రెన్సీ ఉండాల‌న్న‌ది బ్రిక్స్‌+ కూట‌మి దేశాలు భావిస్తున్నాయి. అయితే, డాల‌ర్ ఆధిప‌త్యాన్ని త‌గ్గించాల‌ని చూస్తున్నార‌ని ట్రంప్ ఆరోపిస్తున్నారు. సుంకాలు పెంచుతామ‌న్న త‌న హెచ్చ‌రిక‌ల‌తో బ్రిక్స్ వెన‌క్కి త‌గ్గింద‌ని చెప్పారు. డాలర్ ఆధిప‌త్యాన్ని కాపాడుకోవడానికి ట్రంప్ వాణిజ్య విధానాన్ని ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. 2024లో, BRICS గ్రీన్‌బ్యాక్‌(Green Back)కు పోటీగా ఉమ్మడి కరెన్సీని సృష్టించే ప్రణాళికలతో ముందుకు సాగితే 100% సుంకాల గురించి ఆయన హెచ్చరించారు. “ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా డాలర్(World Reserve Currency Dollar) హోదాను మనం కోల్పోతే, మ‌నం ఓడిపోయిన‌ట్లే అవుతుంది. నేను అలా జరగనివ్వను” అని ఆయన పేర్కొన్నారు.