అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోయవద్దని ఎస్పీ రాజేష్ చంద్ర (SP rajesh Chandra) రైతులకు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
గతేడాది అక్టోబర్ నెలలో జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 27 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. ఈ ప్రమాదాల్లో ఎక్కువ భాగం రోడ్లపై మక్కలు, వడ్లు ఆరబెట్టడం వల్ల జరిగాయని పేర్కొన్నారు. రోడ్లపై ధాన్యం ఆరబెట్టడం వల్ల వాహనాలు జారి అదుపు తప్పడం, రోడ్డు మీద కూర్చున్న రైతులు లేదా పాదచారులను ఢీకొనడం వంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయన్నారు.
ఈ నిర్లక్ష్యం కారణంగా ఎన్నో కుటుంబాలు తమ కుటుంబ సభ్యుడిని కోల్పోయి తేరుకోలేని స్థితిలోకి వెళ్తున్నారని తెలిపారు. చిన్న నిర్లక్ష్యంతో ఒక నిండుప్రాణం కోల్పోతుందని, అందరి భద్రత మన చేతుల్లోనే ఉందన్నారు. రైతులు తమ ధాన్యాన్ని పంటపొలం, గ్రామ పంచాయతీలు, రైతు సమితిలు కేటాయించిన ప్రత్యేక ప్రదేశాల్లోనే ఆరబెట్టాలని తెలిపారు.
రోడ్లపై ధాన్యం ఆరబెట్టకూడదని సూచించడంతో పాటు ప్రజల అవగాహన కోసం రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్లపై పంటలు ఆరబెట్టడం చిన్న నిర్లక్ష్యంగా అనిపించినా అదిపెద్ద ప్రమాదాలకు దారితీస్తుందని ప్రతిఒక్కరూ దీనిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాలను రక్షించగలమన్నారు.