అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tummala Nageswara Rao | రైతులతో రాజకీయాలు చేయడం మానుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు బీజేపీ, బీఆర్ ఎస్ పార్టీలకు హితవు పలికారు. కేంద్రం నుంచి రాకపోవడంతోనే యూరియా కొరత ఏర్పడిందని, సమస్యను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
వ్యవసాయ శాఖ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్(Video Conference) నిర్వహించిన తుమ్మల.. రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains), యూరియా కొరతపై సమీక్షించారు. గోదావరి వరదలపై అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడ సమీక్షించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం తుమ్మల విలేకరులతో మాట్లాడుతూ.. బీజేపీపై మండిపడ్డారు.
Tummala Nageswara Rao | తెలంగాణపై ఎందుకింత కక్ష?
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం(Central Government) వివక్ష చూపుతోందని మంత్రి విమర్శించారు. తెలంగాణపై ఎందుకు కక్షగట్టారో అర్థం కావడం లేదన్నారు. కేంద్రం నుంచి సరిపడా యూరియా రావడం లేదని, కేటాయింపుల మేరకైనా ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో యూరియా కొరతకు, రైతులు ఇబ్బందులు పడటానికి కేంద్రామే ప్రధాన కారణమని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని(Congress Government) బద్నాం చేయడానికి చూస్తోందని ఆరోపించారు. యూరియా ఇవ్వాలని తాను పలుమార్లు ఢిల్లీకి వెళ్లి విన్నవించినా, లేఖలు రాసినా ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గత కొన్ని నెలలుగా కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్న పట్టించుకోవడం లేదని విమర్శించారు. యూరియా విషయమై రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరితే.. ప్రధాని మోదీ దాని అడ్డుకున్నారన్నారు. దేశవ్యాప్తంగా యూరియా ఉత్పత్తి ఆగిపోయిందన్న అన్ని రాష్ట్రాల్లోనూ కొరత ఏర్పడిందని తెలిపారు.
Tummala Nageswara Rao | రైతులను ముందర పెట్టి పార్టీని పెంచుకోలేరు..
యూరియా(Urea) విషయంలో బీజేపీ , బీఆర్ ఎస్ చేస్తున్న విమర్శలను తుమ్మల కొట్టి పడేశారు. ఎన్నడూ యూరియాను చూడని నేతలు కూడా ఇవాళ విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అభాసుపాలు కావొద్దని హితవు పలికారు. రైతు సమస్యలను ముందరకు పెట్టి పార్టీలను పెంచుకుందామంటే అది మూర్ఖత్వమే అవుతుందన్నారు. రైతులపై రాజకీయాలు చేసి పార్టీలను పెంచుకోలేరన్నారు.
Tummala Nageswara Rao | రాంచందర్‌రావు కేంద్రాన్ని అడగాలి..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు(BJP State President Ramachandra Rao) అంటే తనకు గౌరవముందని, కానీ ఆయన మాట్లాడే మాటలు బాలేవన్నారు. అబద్ధాలు మాట్లాడిన పార్టీని పెంచుకుందామంటే అది సాధ్యం కాదన్నారు. నేతల మూర్ఖపు మాటలతో బీజేపీ బలపడదని హితవు పలికారు. నిన్నగాక మొన్న వచ్చిన రాంచందర్‌రావు కూడా విమర్శలు చేస్తున్నారని, తనను విమర్శించడానికి బదులు యూరియా సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని బీజేపీ చీఫ్‌కు సూచించారు. రాంచందర్‌రావుకు అంత పలుకుబడి ఉంటే కేంద్రం నుంచి యూరియా ఇప్పించాలన్న తుమ్మల.. ఆయనకు అంత సీన్ లేదని తీసిపడేశారు. ఒక్క తెలంగాణలోనే యూరియా కొరత లేదని, దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉందన్న విషయం బీజేపీ నేతలు తెలుసుకోవాలని సూచించారు.
Tummala Nageswara Rao | వాస్తవాలు తెలుసుకోండి..
కేంద్రం చేతకానితనంతోనే తెలంగాణకు యూరియా కష్టాలని తుమ్మల(Tummala Nageswara Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలాఖరులోపు తెలంగాణకు కేటాయించాల్సిన యూరియాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు వాస్తవాలు అంగీకరించాలని తెలిపారు. యూరియా కోసం కేంద్రానికి ఎన్నిసార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదన్నారు. బాధ్యతగల పదవిలో ఉన్న రామ్‌చందర్‌రావు సోయిలేకుండా మాట్లాడుతున్నారని, బీజేపీ నేతలు అన్ని తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. కేంద్ర ప్రభుత్వం చేతకానితనాన్ని ఒప్పుకోలేక బీజేపీ నేతల అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొంతమంది రైతులను అడ్డుపెట్టుకుని చచ్చిన పార్టీని బతికించాలని చూస్తున్నారని బీఆర్ ఎస్ నేతలను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. రాజకీయాల కోసం అవాస్తవాలు మాట్లాడి మీ పార్టీల పరువు తీసుకోవద్దని తుమ్మల స్పష్టం చేశారు. యూరియా సమస్యను కొందరు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా చేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు.