అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad Floods | దసరా నేపథ్యంలో హైదరాబాద్(Hyderabad) నగరంలో నివసిస్తున్న ప్రజలు ఇళ్లకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. ఈ తరుణంలో భారీ వర్షం ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మూసీ నదికి వరద పోటెత్తడంతో ఎంజీబీఎస్ బస్టాండ్(MGBS Bus Stand) మునిగిపోయిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు ఎంజీబీఎస్‌ను మూసి వేశారు. అక్కడికి బస్సులను అనుమతించడం లేదు. పండుగ నేపథ్యంలో ఇళ్లకు వెళ్లే ప్రజలు ఎంజీబీఎస్‌కు రావొద్దని వారు సూచించారు. ఈ మేరకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Hyderabad Floods | అక్కడి నుంచి బస్సులు
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ వైపు నుంచి వచ్చే బస్సులు జేబీఎస్ నుంచి రాకపోకలు సాగించనున్నాయి. దీంతో ఆయా జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు జేబీఎస్‌కు రావాలని అధికారులు సూచించారు. వరంగల్, హన్మకొండ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్డు నుంచి, నల్గొండ, సూర్యాపేట, విజయవాడ వెళ్లే బస్సులు ఎల్బీ నగర్ నుంచి నడుస్తున్నాయి. మహబూబ్‌నగర్, కర్నూల్, బెంగళూరు వైపు వెళ్లే బస్సులు ఆరాంఘర్ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని అధికారులు కోరారు. ఇతర వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 సంప్రదించాలని ఆర్టీసీ అధికారులు సూచించారు.
Hyderabad Floods | నార్సింగి సర్వీస్ రోడ్డు మూసివేత
హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో పది వేల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. నార్సింగి-హిమాయత్‌సాగర్ సర్వీస్ రోడ్డుపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు వాహనదారులకు సూచించారు. మరోవైపు గండిపేట (ఉస్మాన్‌సాగర్)కు భారీగా వస్తుండటంతో అధికారులు పది గేట్లు ఎత్తారు.
Hyderabad Floods | సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష
మూసీ నది(Musi River)కి వరద పోటెత్తడంతో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)అధికారులతో సమీక్ష నిర్వహించారు. అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాన్నారు. కాగా అధికారులు ఇప్పటికే దాదాపు వెయ్యి మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.