అక్షరటుడే, కామారెడ్డి : Blood Donation Camp | రక్తదానం ప్రాణదానంతో సమానమని హైకోర్టు న్యాయమూర్తి నందికొండ నర్సింగ్ రావు అన్నారు. జిల్లాకోర్టు ఆవరణలో శనివారం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ, రెడ్‌క్రాస్ సొసైటీ, ప్రభుత్వ ఆస్పత్రి సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరం(Blood Donation Camp)లో పాల్గొన్నారు.
హైకోర్టు న్యాయమూర్తికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వరప్రసాద్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan), ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra), జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. కోర్టు ఆవరణలో మొక్కలు నాటి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి (High Court Judge) మాట్లాడుతూ.. రక్తదానం చేయడం గొప్ప విషయమన్నారు.
రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణం కాపాడే అవకాశం ఉందని తెలిపారు. రక్తదానం ప్రాణాలను కాపాడే పుణ్యకార్యమని, ముఖ్యంగా తలసేమియా బాధిత చిన్నారులకు ఇది ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. తాను కూడా రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యుడినని తెలిపారు. ప్రతిఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని సూచించారు. అనంతరం రక్తదాతలకు అభినందన పత్రాలు అందజేసి, పండ్లు రిఫ్రెష్‌మెంట్స్ పంపిణీ చేశారు.
జిల్లాలోని న్యాయమూర్తులతో సమావేశమై జుడీషియల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కోర్టు భవనాన్ని సందర్శించి, కామారెడ్డి జిల్లా కోర్టుకు (Kamareddy District Court) ప్రభుత్వం కేటాయించిన భూమిని ప్రత్యక్షంగా పరిశీలించారు. అంతకుముందు రామారెడ్డి ఇసన్నపల్లి శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కామారెడ్డి కార్యదర్శి నాగరాణి, కామారెడ్డి సీనియర్ సివిల్ జడ్జి డా.సూర సుమలత, ప్రథమ జూనియర్ సివిల్ జడ్జి సుధాకర్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి దీక్ష, బిచ్కుంద జూనియర్ సివిల్ జడ్జి వినీల్ కుమార్, ఎల్లారెడ్డి న్యాయమూర్తి సుష్మ, బాన్సువాడ న్యాయమూర్తి భార్గవి, జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నంద రమేశ్, జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ ఛైర్మన్ రాజన్న తదితరులు పాల్గొన్నారు.