అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం మరోసారి రాజకీయ, మీడియా వర్గాల్లో చర్చకు దారి తీసింది. ప్రస్తుతం 79 ఏళ్ల వయసులో అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తున్న ట్రంప్.. అమెరికా చరిత్రలో రెండవ అత్యధిక వయస్కుడైన అధ్యక్షుడిగా నిలిచారు.
ఆయనకు ముందు డెమొక్రాటిక్ అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) 82 ఏళ్ల వయసులో పదవీ విరమణ చేశారు. ఇటీవలి కాలంలో ట్రంప్ చేతులపై నీలిరంగు గాయాల మచ్చలు కనిపించడంతో ఆయన ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఆ మచ్చలు మేకప్‌తో కప్పి ఉన్నట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో (Social Media) చర్చ మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ట్రంప్ స్వయంగా స్పందించారు.
Donald Trump | “నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను”
ది వాల్ స్ట్రీట్ జర్నల్‌కు (The Wall Street Journal) ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ తన ఆరోగ్యం గురించి స్పష్టత ఇచ్చారు. “నేను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను. నా ఆరోగ్యంపై పదే పదే ప్రశ్నలు వేయడం విసుగుగా మారింది” అని ఆయన వ్యాఖ్యానించారు. చేతులపై కనిపించిన మచ్చలు ఆరోగ్య సమస్యల వల్ల కాదని, తాను ప్రతిరోజూ రక్తాన్ని పలుచన చేయడానికి తీసుకునే ఆస్ప్రిన్ కారణంగా వచ్చాయని తెలిపారు. “రక్తం గట్టిగా ఉండడం నాకు ఇష్టం లేదు. గుండె నుంచి సన్నని రక్తం ప్రవహించాలి కదా” అంటూ ఆస్ప్రిన్ వాడకం గురించి ట్రంప్ వివరించారు. చేతికి బలంగా తగిలినప్పుడు మాత్రమే మేకప్ లేదా బ్యాండేజ్ వాడతానని కూడా చెప్పారు.
బహిరంగ కార్యక్రమాలు, సమావేశాల్లో ట్రంప్ కళ్లు మూసుకున్నట్లు కనిపించిన వీడియోలు వైరల్ కావడంతో ఆయన నిద్రపోతున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై కూడా ట్రంప్ స్పందిస్తూ, తాను ఎప్పుడూ బహిరంగంగా నిద్రపోలేదని స్పష్టం చేశారు. నేను కొన్నిసార్లు కళ్లు మూసుకుంటాను. అది నాకు విశ్రాంతినిస్తుంది. కానీ దాన్ని నిద్రపోవడం అంటూ చిత్రీకరిస్తున్నారని అన్నారు. రెప్పపాటు తీసిన ఫొటోలతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ట్రంప్ ఆరోపించారు. ఇటీవల తనకు MRI చేయించుకున్నారా అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ, CT స్కాన్ చేయించుకున్నానని చెప్పారు. CT స్కాన్ శరీర పరిస్థితిని త్వరగా తెలుసుకునే సాధారణ పరీక్ష అని తెలిపారు. అలాగే తనకు వినికిడి సమస్యలు లేవని కూడా ఖండించారు. ట్రంప్ ఆరోగ్యంపై వస్తున్న విమర్శలు ఆయన గతంలో మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌ను “స్లీపీ జో” అంటూ ఎగతాళి చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేస్తున్నాయి.