అక్షరటుడే, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని ఆగం చేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump).. చివరకు న్యాయస్థానాలను సైతం హెచ్చరించే దాకా వెళ్లిపోయారు. తన ప్రభుత్వ సుంకాల విధానాలకు వ్యతిరేకంగా ఫెడరల్ కోర్టు(US Federal Court) తీర్పు ఇస్తే దేశం 1929 తరహా మహా మాంద్యాన్ని ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
తమ సుంకాల వల్లే స్టాక్ మార్కెట్లు సానుకూల దిశగా సాగుతున్నాయని ట్రంప్ తెలిపారు. వందల కోట్ల డాలర్ల ఆదాయం వస్తోందని, ఆర్థిక వ్యవస్థ బలపడుతోందని చెప్పారు. అమెరికా గ్రేట్ అగెయిన్ దిశగా వెళ్తున్న తరుణంలో సుంకాలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే మాంద్యం తప్పదని హెచ్చరించారు.
ట్రంప్ వచ్చాక విధించిన సుంకాల వల్ల తమకు నష్టం జరిగిందని పలువురు వ్యాపారాలు, రాష్ట్రాలు వేసిన హై-స్టేక్స్ కేసుపై అమెరికా ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు తన తీర్పును వెలువరించడానికి సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ నుంచి ఈ హెచ్చరిక రావడం విశేషం.
Donald Trump : మా హయాంలో కొత్త రికార్డులు
సుంకాల విధింపును సమర్థించుకుంటూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ లో సుంకాలను సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. టారిఫ్‌లు అమెరికా ఆర్థిక వ్యవస్థపై భారీ సానుకూల ప్రభావాన్ని చూపాయని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ప్రతిరోజూ కొత్త రికార్డులను చేరుకోవడానికి తమ ఆర్థిక వ్యూహం సహాయపడిందని పేర్కొన్నారు. టారిఫ్ విధింపు స్టాక్ మార్కెట్లు సానుకూల ప్రభావం చూపిందన్నారు.
ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న తరుణంలో టారిఫ్‌లకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని, ఆర్థికంగా వినాశకరమవుతుందని, దేశం ఎప్పటికీ కోలుకోకపోవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రస్తుతం గొప్పగా ఎదిగే దిశలో ఉందని, సంపద సృష్టితో పాటు శక్తివంతమవుతున్న తరుణంలో వ్యతిరేకంగా తీర్పు వస్తుంటే మాత్రం మళ్లీ గొప్పగా ఎదిగే అవకాశముండదన్నారు. అగ్రరాజ్యం గొప్పగా విజయం సాధించడానికి అర్హమైనదని తెలిపారు.
Donald Trump : ట్రంప్ హైలైట్ చేసిన ఆర్థిక లాభాలు
స్టాక్ మార్కెట్‌పై సుంకాలు భారీ సానుకూల ప్రభావాన్ని చూపుతున్నాయి. దాదాపు ప్రతిరోజూ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అదనంగా, మన దేశ ఖజానాలోకి వందల బిలియన్ డాలర్లు పోటెత్తుతున్నాయని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దేశీయ తయారీని పెంచడానికి, ఆదాయపు పన్నులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఒక వ్యూహంగా సుంకాలను ఉపయోగించడాన్ని ట్రంప్ సమర్థించుకున్నారు.
అయితే, ఈ సంవత్సరం ప్రారంభంలో ఆయన ప్రవేశపెట్టిన విస్తృత సుంకాలను సవాలు చేస్తూ పిటిషన్లు దాఖలు కావడంతో ప్రస్తుతం కోర్టులో విచారణ జరుగుతోంది. చైనా(China), కెనడా(Canada), మెక్సికో(Mexico)ను లక్ష్యంగా చేసుకుని ఫిబ్రవరిలో ప్రకటించిన అదనపు సుంకాలతో పాటు, వివిధ వాణిజ్య భాగస్వాములపై ఏప్రిల్‌లో విధించిన సుంకాలు కూడా న్యాయ పరిశీలనలో ఉన్నాయి.
