అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nobel Prize | నోబెల్ శాంతి బహుమతి వస్తుందని తహతహలాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఊహించని రీతిలో షాక్ తగిలింది. నార్వేజియన్ నోబెల్ కమిటీ (Norwegian Nobel Committee) ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. నోబెల్ వరిస్తుందనుకున్న అగ్రరాజ్య అధ్యక్షుడికి ‘నో’ చెప్పి నిరాశకు గురి చేసింది.
రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ కోసం తీవ్రంగా కలలు గన్నారు. ఈ క్రమంలో తాను భారత్-పాకిస్తాన్ మధ్య సైనిక సంఘర్షణ సహా ఎనిమిది యుద్ధాలు ఆపానని ప్రకటించుకున్నారు. ఈ క్రమంలో ఆయన అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ నోబెల్ అవార్డు (Nobel Prize) వరించలేదు. వెనెజులాకు చెందిన మరియా కొరీనా మచాడోను ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి-2025 వరించింది. ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడినందుకుగాను మరియా కొరీనాకు ఈ పురస్కారం అందజేశారు.
Nobel Prize | ఒబామాకు ఇవ్వడంపై రుసరుస..
కొన్ని రాజకీయ వర్గాల నుండి ప్రజల మద్దతు లభించినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2025 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. తన పదవీకాలంలో బహుళ సంఘర్షణలను నివారించినందుకు ప్రతిష్టాత్మక అవార్డును అందుకోవాలని ట్రంప్ (Donald Trump) గతంలో చాలాసార్లు తన ఆకాంక్షను వెల్లడించారు.
జనవరిలో రెండోసారి తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం లాబీయింగ్ చేస్తున్నాడు. ఎనిమిది యుద్ధాలను ఆపానని పదే పదే చెబుతున్నాడు. మే నెలలో చెలరేగిన భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంఘర్షణను తానే ఆపినట్లు క్రెడిట్ పొందే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నోబెల్ బహుమతికి మొత్తం 338 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అందులో 244 మంది వ్యక్తులు, 94 సంస్థలు ఉన్నాయి.
అయితే, వెనిజులా ప్రజాస్వామ్య కార్యకర్త మరియా కొరినా మచాడోకు (Maria Corina Machado) నోబెల్ బహుమతి దక్కింది. ఈసారి నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్.. అవార్డు ప్రకటనకు ముందు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏమీ చేయకున్నా ఆయనకు నోబెల్ శాంతి బహుమతి ఇచ్చారని విమర్శించారు. అయితే ఎనిమిది యుద్ధాలు ఆపిన తనకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందో, రాదో తెలియదని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
Nobel Prize | సోషల్ మీడియాలో వెక్కిరింతలు..
నోబెల్ శాంతి బహుమతి ప్రకటన తర్వాత అమెరికా అధ్యక్షుడిపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనను వెక్కిరిస్తూ అనేక మీమ్స్, పోస్టులు వెల్లువలా వచ్చి పడ్డాయి. డోనాల్డ్ ‘జోకర్’ ట్రంప్‌కు నోబెల్ శాంతి బహుమతి వస్తుందని ఆశిస్తున్న వారి కోసం రెండు నిమిషాలు మౌనం పాటిస్తున్నట్లు ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా శాంతిని వ్యాపింపజేస్తున్న ట్రంప్ ఇంకా నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకోలేదని నమ్మడం కష్టంగా ఉందని మరో నెటిజన్ పోస్టు చేశారు. ట్రంప్ “ప్రాథమికంగా అవార్డుల ప్రదర్శనకు తన సొంత ట్రోఫీని తీసుకువచ్చే పిల్లవాడిలా” ఉన్నారని లేట్-నైట్ షో హోస్ట్ జిమ్మీ కిమ్మెల్ చమత్కరించారు. ట్రంప్ కు బహుమతి ఇవ్వడం ద్వారా అతను జీవితాంతం అద్దంలో దానిని ఆరాధిస్తూ గడిపేస్తాడు. మళ్లీ కనిపించకుండా ఉంటాడని మరో నెటిజన్ ఎద్దేవా చేశారు. ఏడు సంఘర్షణలను ముగించిన ట్రంప్.. నోబెల్ కోసం మరో ఎనిమిది యుద్ధాలను ప్రారంభించి మరింత గందరగోళానికి తెర లేపుతారని సేథ్ మేయర్స్ చమత్కరించారు.