అక్షరటుడే, కామారెడ్డి : Government advisor Shabbir Ali | ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత గడిచిన రెండేళ్లలో కామారెడ్డికి (Kamareddy) చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పి ప్రజలను ఓట్లు అడిగే దమ్ముందా అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యే కేవీఆర్‌ను (MLA KVR) సూటిగా ప్రశ్నించారు. కామారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో శుక్రవారం కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Government advisor Shabbir Ali | అభివృద్ధి అంటే పారిపోవడమా..?
ప్రచారంలో భాగంగా షబ్బీర్ అలీ ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టారు. అభివృద్ధి అంటే పారిపోవడమా అని ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలు నిలదీస్తుంటే సమాధానం లేక తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. రోడ్లు వేయడం, డ్రెయినేజీలు కట్టడం, నీటి సరఫరా చేయడం, పట్టణ పారిశుధ్యం, స్ట్రీట్ లైట్లు వేయడం అభివృద్ధి కాదని ఎమ్మెల్యే మాట్లాడుతున్నారని, అసలు అభివృద్ధి అంటే ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు.
Government advisor Shabbir Ali | అభివృద్ధిని మేం చూపిస్తున్నాం..
ఎన్నికల్లో గెలిచి ప్రజలకు కనపడకుండా పారిపోవడమే వాళ్ల దృష్టిలో అభివృద్దా.. అని షబ్బీర్‌అలీ నిలదీశారు. తాము ఈ గడ్డపై చేసిన అభివృద్ధిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నామని, ఆ ధైర్యంతోనే ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నామన్నారు. కరప్షన్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఎమ్మెల్యేకు లేదని, ఆయన గత చరిత్ర అంతా అవినీతిమయమని, దాన్ని నిరూపించే బాధ్యత తమదని పేర్కొన్నారు. తాను సాధ్యమైన పనులకి హామీ ఇస్తానని, వాటిని అమలు చేసి చూపిస్తానన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన తర్వాత ఎవరైనా అవినీతికి పాల్పడితే, వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, వారిని ఇందిరా గాంధీ చౌరస్తా వద్ద నిలబెట్టి పార్టీ నుండి సస్పెండ్ చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నట్టు తెలిపారు. కామారెడ్డి పట్టణ సమగ్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే (Congress Party) సాధ్యమని, హస్తం గుర్తుకు ఓటు వేసి మన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.