అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Warangal MGM | వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో ఓ రోగి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో (MGM Hospital) చోటు చేసుకుంది.
రోగులకు రక్తం అవసరం అయినప్పుడు బ్లడ్ బ్యాంక్ (blood bank) నుంచి తెచ్చి ఎక్కిస్తారు. అయితే రోగి బ్లడ్ గ్రూప్ పరీక్షించి అదే రకం రక్తాన్ని ఎక్కిస్తారు. వేరే రకం గ్రూప్ రకం రక్తం ఎక్కిస్తే వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఇలాంటి ఘటనే వరంగల్‌లోని (Warangal) ఎంజీఎం ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ల్యాబ్ సిబ్బంది బ్లడ్ గ్రూప్ పరీక్షల్లో తప్పు దొర్లడంతో ఆమె ప్రాణాలకు మీదకు వచ్చింది.
Warangal MGM | చెప్పినా వినకుండా..
హనుమకొండ జిల్లా (Hanumakonda District) కాజీపేట మండలం అయోధ్యపురానికి చెందిన జ్యోతికి తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు ఈ నెల 16న ఎంజీఎంకు తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు రక్తం చాలా తక్కువగా ఉందని బ్లడ్ ఎక్కించాలని చెప్పారు. దీంతో 17న ఆమె బ్లడ్ శాంపిల్స్ తీసి రక్తనిధి కేంద్రానికి పంపించగా టెక్నీషియన్లు ఆమెది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్‌గా (B positive blood group) అని తెలిపారు. దీంతో జూనియర్ డాక్టర్లు బీ పాజిటివ్ బ్లడ్ గ్రూప్ రక్తం తెచ్చి ఎక్కించారు. అయితే అప్పుడే ఆమె తనది ఓ పాజిటివ్ అని చెప్పినా.. వారు పట్టించుకోలేదు.
వేరే రకం రక్తం ఎక్కించడంతో ఆమె అనారోగ్యానికి గురైంది. దీంతో మరోసారి బ్లడ్ టెస్ట్ చేయగా.. ఓ పాజిటివ్ (O positive) అని తేలింది. దీంతో అప్రమత్తమైన డాక్టర్లు ఆమెకు చికిత్స చేశారు. కాగా ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని నిమ్స్‌కు తరలించాలని కుటుంబ సభ్యులకు డాక్టర్లు తెలిపారు. తమ ఆర్థిక పరిస్థితి బాగాలేదని, తన భార్యను కాపాడాలని భర్త రాజు వైద్యులను కోరారు.