అక్షరటుడే, వెబ్డెస్క్ : Land Rates | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని రాయదుర్గంలో భూమి రికార్డు ధర పలికింది. ఎకరం భూమి ఏకంగా రూ.177 కోట్లకు అమ్ముడు పోయింది. సోమవారం టీఎస్ఐఐఐసీ నిర్వహించిన వేలం పాటలో రికార్డు ధరకు ఓ రియల్ ఎస్టేట్ సంస్థ భూములను దక్కించుకుంది.
నగరంలోని భూములను కొంతకాలంగా TSIIIC ఆధ్వర్యంలో వేలం వేస్తున్న విషయం తెలిసిందే. నిధుల కోసం ప్రభుత్వం భూములను విక్రయిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీ (Knowledge City) భూములకు వేలం నిర్వహించారు. దీనికి రికార్డు స్థాయిలో స్పందన వచ్చింది. అత్యధికంగా ఎకరం భూమి రూ.177 కోట్లు పలికింది.
అత్యధిక ధరకు 7.6 ఎకరాల భూమిని MSN రియాల్టీ కంపెనీ రూ.1357.59 కోట్లకు దక్కించుకుంది. వేలం ప్రారంభ ధర ఎకరాకు రూ.101 కోట్లు ఉండగా MSN రియాల్టీ ఏకంగా రూ.177 కోట్లకు కొనుగోలు చేసింది. గతంలో 2023లో రాజపుష్పా సంస్థ ఎకరాకు రూ.100 కోట్లు పాడి భూమిని దక్కించుకుంది. ఇది దానికంటే చాలా ఎక్కువ కావడం గమనార్హం.