అక్షరటుడే, వెబ్‌డెస్క్ : జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడి జరగ్గా.. మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టింది. పీవోకే, పాక్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలను భారత వైమానిక దళం ధ్వంసం చేసింది. ఈ దాడిలో వంద మంది వరకు టెర్రరిస్టులు హతం అయ్యారు.
భారత్ ఆపరేషన్ సిందూర్‌తో బిత్తరపోయిన పాక్.. ప్రతీకార దాడులకు తెగబడింది. డ్రోన్లు, మిసైళ్లు, యుద్ధ విమానాలతో భారత్‌పై దాడి చేసింది. అయితే భారత గగనతల రక్షణ వ్యవస్థ పాక్ దాడులను సమర్థవంతంగా అడ్డుకుంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్–400 వ్యవస్థ (S-400 System) పాక్ ప్రయోగించిన క్షిపణులను మధ్యలోనే కూల్చివేసింది.
Brahmos Missile | ఆరు పాక్ విమానాల కూల్చివేత
దాడికి యత్నించిన ఆరు పాక్ విమానాలను భారత్ కూల్చి వేసింది. ఎస్ –400 రక్షణ వ్యవస్థ మూడు విమానాలను కూల్చి వేసినట్లు సమాచారం. అలాగే భారత వైమానిక దళం కూడా పాక్ విమానాలను కూల్చేసినట్లు తెలిసింది. అలాగే పాక్‌లోని నాలుగు రాడార్ (Radar) వ్యవస్థలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) ధ్వంసం చేసింది.
Brahmos Missile | 19 బ్రహ్మోస్ క్షిపణులతో దాడి
పాకిస్తాన్ దాడులను తిప్పి కొట్టిన భారత్ మే 10న తన ఉగ్రరూపాన్ని చూపెట్టింది. దాయాది దేశంలోని ఎయిర్ బేస్ (Air Base)లే లక్ష్యంగా 19 బ్రహ్మోస్ మిసైళ్ల (Brahmos Missile)ను ప్రయోగించింది. మొత్తం 11 వైమానిక స్థావరాలపై భారత్ దాడులు చేసింది. దీంతో పాక్ ఎయిర్ బేస్‌లకు తీవ్ర నష్టం వాటిల్లింది. IAF క్షిపణి దాడిలో పాక్ ఎయిర్‌బేస్‌లోని రెండు F-16 యుద్ధ విమానాలు పాక్షికంగా తిన్నట్లు సమాచారం. భారత్ పాక్‌పై బ్రహ్మోస్‌తో పాటు ఫ్రెంచ్ SCALP సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించింది. ఈ సందర్భంగా పాక్ ప్రయోగించిన క్షిపణులను భారత్ అడ్డుకుంది. అనంతరం రెండు దేశాలు కాల్పుల విరమణ (Ceasefire)కు అంగీకరించాయి.