అక్షరటుడే, హైదరాబాద్ : Curd Benefits | ఉపవాసం చేసేటప్పుడు, ఏ ఆహారం తీసుకోవాలో నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహారాలు మిమ్మల్ని అలసిపోయేలా చేస్తే, మరికొన్ని చురుకుగా, శక్తివంతంగా ఉండేలా చేస్తాయి. పెరుగు(Curd).. అలాంటి ఆహారపదార్థాలలో ఒకటి.
ఇది రుచి, పోషణ, సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. పెరుగుకు ఉండే సాత్విక గుణాలు ఉపవాస సమయంలో మనసుకు ప్రశాంతతనిచ్చి, శరీరానికి పోషణను అందిస్తాయి. గోద్రెజ్ ఇండస్ట్రీస్ న్యూట్రిషనల్ కన్సల్టెంట్ డాక్టర్ మనికా సింగ్.. ఉపవాస సమయం(Fasting Time)లో పెరుగు తింటే కలిగే లాభాలను వివరించారు.
5 కారణాలు..
శక్తిని అందిస్తుంది, ఆకలి తగ్గిస్తుంది:
100 గ్రాముల పెరుగులో సుమారు 11 గ్రాముల ప్రొటీన్, 98 కేలరీలు ఉంటాయి.
దీనిలోని కేసిన్(Casein) అనే ప్రొటీన్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీనివల్ల మీకు ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఇది తరచుగా ఆకలి వేయకుండా నియంత్రిస్తుంది.
జీర్ణక్రియకు సహాయపడుతుంది:
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరానికి పోషకాలు బాగా అందేలా చేస్తాయి.
ఇది శరీరంలో వేడిని తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను చల్లగా ఉంచుతుంది.
రోగనిరోధక శక్తిని, మానసిక స్పష్టతను పెంచుతుంది:
పెరుగులోని ప్రోబయోటిక్స్ పేగులు, మెదడు మధ్య సంబంధాన్ని మెరుగుపరుస్తాయి. దీనివల్ల ఒత్తిడి తగ్గి, మానసిక స్పష్టత పెరుగుతుంది.
ఇది శరీరంలో మంటను తగ్గించి, రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది.
PH స్థాయులను సమతుల్యం చేసి, ఎసిడిటీని తగ్గిస్తుంది:
ఉపవాసం చేసేటప్పుడు కడుపు ఖాళీగా ఉండటం వల్ల ఎసిడిటీ లేదా గుండెల్లో మంట కలగవచ్చు.
పెరుగులో pH స్థాయి 4.5 నుండి 5.5 మధ్య ఉంటుంది. ఇది కడుపులో ఉత్పత్తి అయ్యే అదనపు ఆమ్లాన్ని సమతుల్యం చేస్తుంది.
ఎలక్ట్రోలైట్ సమతుల్యతను పునరుద్ధరిస్తుంది:
చెమట, శ్వాస వంటి సాధారణ శరీర ప్రక్రియల వల్ల పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్లు శరీరంలో తగ్గుతాయి. ఉపవాసం చేసేటప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది.
పెరుగులో 75% కన్నా ఎక్కువ నీరు ఉంటుంది. అలాగే కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉంటాయి. ఇది శరీరాన్ని హైడ్రేట్ చేసి, కండరాల తిమ్మిరి, అలసటను నివారిస్తుంది.
ఉపవాస సమయంలో పెరుగు తినడం వలన శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, జీర్ణక్రియ(Digestion), హైడ్రేషన్, రోగనిరోధక శక్తికి కూడా మద్దతు లభిస్తుంది. దీన్ని నేరుగా, రైతాగా లేదా పండ్లతో కలిపి తీసుకోవచ్చట.