అక్షరటుడే, వెబ్‌డెస్క్: TPTF | ప్రభుత్వం పాఠశాలల తనిఖీ (school inspection) బాధ్యతలను ఉపాధ్యాయులకు అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగల్ల సురేశ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో నగరంలోని పలు పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం రాష్ట్రవ్యాప్తంగా 24,246 ప్రభుత్వ పాఠశాలల్లో (government schools) 1,473 మంది ఉపాధ్యాయులతో 299 కమిటీలు ఏర్పాటు చేసిందన్నారు. వీరికి పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఉమ్మడి సర్వీస్ రూల్స్ అమలుచేసి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంఈవో, డిప్యూటీ డీఈవో పోస్టులను భర్తీ చేయాలని, వారితో పాఠశాలల పర్యవేక్షణ చేయించాలన్నారు. అంతేకాని, ఉపాధ్యాయులకు అప్పగించడంతో విద్యా బోధన కుంటుపడుతుందని పేర్కొన్నారు.
పెండింగ్ బిల్లుల (pending bills) కోసం ప్రతి నెలా రూ.700 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి రెండు నెలలు మాత్రమే చెల్లించారన్నారు. ఆగస్టులో సుమారు రూ.200 కోట్ల విలువైన ఒక నెల డీఏ బిల్లులు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని, హెల్త్ కార్డుల నిబంధనలు రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు.
జూలై 2023 నుంచి రావాల్సిన పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఒక్కో తరగతికి ప్రత్యేక గది, ఒక టీచర్ను నియమించాలన్నారు. 5 వేల ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎం పోస్టులు మంజూరు చేసి ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అరవింద్, జిల్లా నాయకులు గోపి, నరేందర్, ప్రవీణ్, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.