అక్షరటుడే, కామారెడ్డి: DK Aruna comments | ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై (Mla Venkata Ramana Reddy) చేసిన ఆరోపణలు నిరూపించాలని, లేకపోతే ముక్కు నేలకు రాసి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎంపీ డీకే అరుణ(MP DK Aruna) ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
DK Aruna comments | ఇద్దరు సీఎంలను ఓడించి..
ఇద్దరు సీఎంలను ఓడించి జాయింట్ కిల్లర్‌గా పేరు తెచ్చుకుని అభివృద్ధి కోసం నిజాయితీగా ముందుకు వెళ్తున్న ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. అధికారిక కార్యక్రమాలకు సమాచారం ఇవ్వకపోవడం, ప్రొటోకాల్ పాటించకపోవడం, మంత్రులు వచ్చి కార్యక్రమాలు చేసుకుంటూ పోవడం.. కక్షసాధింపు చర్యల్లో భాగమేనన్నారు. ఇదంతా సీఎం పన్నిన కుతంత్రం అని పేర్కొన్నారు. 9సార్లు పోటీచేసి ఏడుసార్లు ఓడిపోయి రెండుసార్లు మాత్రమే గెలిచిన షబ్బీర్ అలీ ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పురమాయించి లేనిపోని ఆరోపణలతో ఎమ్మెల్యేకు మచ్చ తెచ్చే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఆరోపణలను రుజువు చేసేందుకు కలెక్టర్ కార్యాలయానికి రమ్మని ఎమ్మెల్యే సవాల్ చేస్తే అధికారంలో ఉండి కూడా ఎందుకు రుజువు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు.
ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలి..
ఆరోపణలు చేయడం గొప్ప కాదని, వాటిని నిరూపించే దమ్ము ఉండాలన్నారు. మచ్చలేని నాయకుడిపై అహంకార ధోరణి ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తమ ఎమ్మెల్యేను కలవడానికి రాష్ట్ర నాయకులు (Telangana Political News) వస్తుంటే అడుగడుగునా పోలీసుల నిర్బంధంతో ఎందుకు అడ్డుకుంటున్నారని.. ఎందుకు అరెస్టులు చేస్తున్నారని ప్రశ్నించారు. తమ ఎమ్మెల్యేను కలవడానికి కూడా పోలీసుల అనుమతి కావాలా అని నిలదీశారు. తాము ఏమైనా గొడవ చేయడానికి వస్తున్నామా..? కొట్టడానికి వస్తున్నామా..? ఈ విధానం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.
కామారెడ్డి అభివృద్ధికి పాటుపడాలి..
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారని, ఇక్కడ ఎమ్మెల్యే కేవీఆర్ గెలవడాన్ని స్వాగతించి ఇక్కడి అభివృద్ధికి పాటుపడాలని డీకే అరుణ పేర్కొన్నారు. కక్ష సాధింపులతో ప్రొటోకాల్ లేకుండా చేయడం గొప్ప అనిపించుకోదన్నారు. ఎమ్మెల్యే చేసిన ప్రతిపాదనలు మంజూరు చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. పదేళ్లపాటు అధికారం చలాయించి మరో 30 ఏళ్లు ఉంటామని చెప్పిన వాళ్లు నేడు లేరని, అలా విర్రవీగడం కాకుండా ఉన్నప్పుడే ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యమన్నారు. ప్రజాతీర్పును గౌరవించాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. అడ్డగోలుగా ఆరోపణలు చేస్తామంటే కుదరదని, ఎదురు దాడికి వచ్చేదాకా చేసుకోకుండా సరిదిద్దుకోవాలని సూచించారు. అవినీతిపరులెవరో.. నీతిపరులెవరో ప్రజలకు తెలుసన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన నాయకుని ఆరోపణలు వెనక్కి తీసుకునేలా చేయాలని, లేదంటే నిరూపించేలా చొరవ తీసుకోవాలన్నారు. లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మతతత్వ పార్టీ ఎవరిదో ప్రజలు గుర్తించాలి
బాన్సువాడ పట్టణంలో (Banswada) అలాంటి ఘటన జరగాల్సింది కాదని ఎంపీ డీకే అరుణ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు జరగరానిది ఏదైనా జరిగితే దాని వెనక ఉన్నవారు బాధ్యత తీసుకోవాలన్నారు. రెచ్చగొట్టి మత విధ్వంసాలు సృష్టించింది ఎవరన్నారు. మాటిమాటికి బీజేపీ మతతత్వ పార్టీ అని ఆరోపిస్తారని, ఇప్పుడు మతతత్వ పార్టీ ఏది అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే ముస్లిం.. ముస్లిం అంటేనే కాంగ్రెస్ అనే నాయకులదా మతతత్వ పార్టీ.. సబ్ కా సాత్..సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ అనే బీజేపీ మతతత్వ పార్టీనా.. ఎవరిది మతతత్వ పార్టీ అని ప్రశ్నించారు. ఇటువంటి ఘటనలు జరగడానికి సీఎం ప్రోద్బలం చేస్తున్నారేమోనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఆయన మాటల సపోర్టుతో ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. బాన్సువాడలో జరిగిన ఘటనను ఖండిస్తున్నట్టు తెలిపారు.
