Homeతాజావార్తలుTelangana Congress | మరో‘సారీ’ నిరాశే.. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మొండి‘చేయి’

Telangana Congress | మరో‘సారీ’ నిరాశే.. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మొండి‘చేయి’

నిజామాబాద్​ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, సీనియర్​ కాంగ్రెస్​ ఎమ్మెల్యే సుదర్శన్​రెడ్డి ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. కాని మంత్రివర్గ విస్తరణలో మాత్రం జిల్లాకు మరోసారి మొండిచేయి చూపించారని పలువురు వ్యాఖ్యానించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Congress | కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టింది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ (Azharuddin)కు కేబినెట్ లోకి బెర్తు కల్పించింది. అయితే, ఉమ్మడి జిల్లాకు కాంగ్రెస్ మూడోసారి రిక్త‘హస్తమే’ చూపింది. తాజాగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారంతో కలిపి కలిపి ఇప్పటివరకూ మూడు సార్లు కేబినెట్ విస్తరణ జరిగినా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది.

కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని భావించిన బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి (MLA Sudarshan Reddy)కి మరోసారి నిరాశే మిగిలింది. అలాగే, ఉమ్మడి జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ (Shabbir Ali)కి కూడా భంగపాటే ఎదురైంది. ఆయనకు కూడా ఈసారి అవకాశం దక్కకుండా పోయింది. మంత్రి పదవి రాలేదన్న తీవ్ర అసంతృప్తిలో ఉన్న బోధన్ ఎమ్మెల్యేను సంతృప్తి పరిచేందుకు కాంగ్రెస్ నాయకత్వం.. షబ్బీర్అలీ తరహాలోనే ఆయనను కూడా ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.

Telangana Congress | కేబినెట్ లో కరువైన ప్రాతినిధ్యం

రాష్ట్ర కేబినెట్లో ఉమ్మడి జిల్లా నుంచి ఎవరో ఒకరు ప్రాతినిధ్యం వహిస్తుండడం కొన్ని దశాబ్దాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం (Telangana State)  ఆవిర్బవించిన తర్వాత కూడా ఆ సంప్రదాయం కొనసాగింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాకు చెందిన నేతలెందరో మంత్రులుగా పని చేశారు. అర్గుల్ రాజారాం, మహిపాల్ రెడ్డి నుంచి మొదలుకుని సంతోష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, డి.శ్రీనివాస్, వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) వరకూ వివిధ ప్రభుత్వాల్లో జిల్లా నుంచి అమాత్యులుగా ప్రాతినిధ్యం వహించారు. అయితే, దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి జిల్లాకు కేబినెట్ లో చోటు లేకుండా పోయింది. తొలిసారి మంత్రివర్గ విస్తరణ జరిగిన సమయంలో రేవంత్ రెడ్డి సహా 12 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా, వారిలో జిల్లా నుంచి ఒక్కరికీ అవకాశం దక్కలేదు. ఇటీవల రెండో సారి విస్తరణ జరిగినప్పటికీ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలకు చాన్స్ రాలేదు. మూడోసారైనా అవకాశం లభిస్తుందనుకుంటే నిరాశే మిగిలింది.

Telangana Congress | మంత్రుల్లేరు.. సలహాదారులే

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాపై కాంగ్రెస్ నాయకత్వం వివక్ష చూపుతున్నట్లే కనిపిస్తోంది. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో కలిపి కాంగ్రెస్ పార్టీ (Congress Party)కి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు., బీఆర్ ఎస్ నుంచి గెలిచిన పోచారం శ్రీనివాసరెడ్డి తదనంతర పరిణామాల్లో హస్తం పార్టీ పంచన చేరారు. రాజీకయంగా ఎంతో కీలకమైన ఉమ్మడి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం.. సలహాదారులతో సరిపెడుతోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivasa Reddy)కి సైతం ప్రభుత్వ సలహాదారుగా అవకాశం కల్పించింది. ఇక తాజాగా, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డిని కూడా సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ సలహాదారుల సంఖ్య మూడుకు చేరింది.

Telangana Congress | మంత్రి కానీ మంత్రిగా..

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. ఆయన కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ తొలి, మలి విడుత విస్తరణలో భంగపాటు తప్పలేదు. తాజాగా జరిగిన విస్తరణలో అయినా చాన్స్ వస్తుందని భావించగా, మరోసారి నిరాశే ఎదురైంది. 70 ఏండ్ల వయస్సు పైబడిన సుదర్శన్ రెడ్డి ఆది నుంచి కాంగ్రెస్ వాదిగా ఉన్నారు. గత పదేళ్లలో పార్టీ అనేక కష్టాల్లో ఉన్నప్పటికీ ఆయన మాత్రం పక్కచూపులు లేదు. వయస్సు, సీనియారిటీ, అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్నా పీఎస్సార్ కు అమాత్యుడిగా అవకాశం దక్కాల్సి ఉంది. కానీ రేవంత్ ప్రభుత్వం మూడుసార్లు మొండి చేయి చూపింది. ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ హోదాతో పాటు విశేష అధికారాలు కల్పిస్తూ మంత్రి కాని మంత్రిని చేసింది.