అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Disha Patani | బాలీవుడ్ నటి దిశా పటాని (Disha Patani) ఇంటి వద్ద ఇటీవల చోటుచేసుకున్న కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా గుర్తించిన ఇద్దరు వ్యక్తులు బుధవారం (సెప్టెంబర్ 17) పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) మృతి చెందారు.
ఈ విషయాన్ని దిల్లీ పోలీసులు (Delhi Police) అధికారికంగా ధ్రువీకరించారు. వివరాల ప్రకారం, గాజియాబాద్(Ghaziabad)లోని ట్రోనికా సిటీలో నిందితులు రవీందర్ అలియాస్ కుల్లు, అరుణ్ ఉన్నారని సమాచారం అందిన వెంటనే దిల్లీ పోలీసులు, ఉత్తర్‌ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్) సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టింది. వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో నిందితులు కాల్పులు జరపగా, జరిగిన ఎదురుకాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారు.
Disha Patani | ఇద్దరు ఎన్ కౌంటర్..
ఆసుపత్రికి తరలించినప్పటికీ ఇద్దరూ చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలం నుంచి తుపాకులు, పెద్ద మొత్తంలో బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు రోహిత్ గోదారా–గోల్డీ బ్రార్ గ్యాంగ్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. ఈ ఎన్కౌంటర్లో పోలీసులు కూడా గాయపడ్డారు. దిల్లీ సబ్ ఇన్స్పెక్టర్ రోహిత్(Delhi SI Rohit) ఎడమ చేతికి, హెడ్ కానిస్టేబుల్ కైలాశ్ కుడి చేతికి గాయాలయ్యాయి. యూపీ ఎస్టీఎఫ్కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా గాయపడ్డారు.
ఇదే ఘటనపై యూపీ ఎస్టీఎఫ్ అదనపు ఎస్పీ రాజ్‌కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. నిందితుల కదలికలు హరియాణా, దిల్లీ ప్రాంతాల్లో ఉన్నట్లు సమాచారం రావడంతో సెర్చ్ ఆపరేషన్ (Search operation) చేపట్టామని తెలిపారు. వారిని పట్టుకునే సమయంలో ఎదురుకాల్పులు జరగడంతో ఈ పరిణామం చోటుచేసుకుందని ఆయన వివరించారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, సెప్టెంబర్ 12న బరేలీలోని సివిల్ లైన్స్‌లో దిశా పటాని ఇంటి వద్ద బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు 10–12 రౌండ్ల కాల్పులు జరపగా, ఈ ఘటనకు గోల్డీ బ్రార్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటించింది. నటి సోదరి, మాజీ ఆర్మీ అధికారిణి ఖుష్బూ పటానీ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమని సమాచారం. ఈ ఎన్కౌంటర్, ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇచ్చిన భరోసా మరుసటి రోజే జరిగిందన్న విషయం ప్రత్యేకంగా నిలుస్తోంది.