అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Karnataka CM | కర్ణాటక రాజకీయాలు గంట గంటకూ మారుతున్నాయి. ముఖ్యమంత్రి సీటుపై కొనసాగుతున్న హైడ్రామా మరో కీలక దశకు చేరుకుంది. తాజా పరిణామాలు చూస్తే సీఎంగా సిద్ధరామయ్య (CM Siddaramaiah) వైదొలగడం దాదాపుగా ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతుంది.
ఆయన స్థానంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (Deputy CM DK Shivakumar) బాధ్యతలు చేపట్టే అవకాశాలు మరింత బలపడుతున్నాయి. పార్లమెంట్ వింటర్ సెషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, కర్ణాటక నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ హైకమాండ్ (Congress High Command) త్వరితగతిన నిర్ణయం తీసుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో నెలలుగా సాగుతున్న అంతర్గత విభేదాలు, అధికార పంపకం ఒప్పందంపై ఏర్పడిన వివాదాలు హైకమాండ్‌ను ఆలోచనలో పడేసినట్టుగా చెబుతున్నారు.
Karnataka CM | డీకేకు రాహుల్ నుండి కీలక సందేశం
గత వారం రోజులుగా తనతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్న డీకే శివకుమార్‌కు రాహుల్ గాంధీ “ప్లీజ్ వెయిట్… నేను మీకు కాల్ చేస్తా” అని వాట్సాప్ మెసేజ్ పంపినట్లు సమాచారం. ఈ మెసేజ్ రావడంతో డీకే శివకుమార్ శిబిరంలో జోష్ పెరిగి, నాయకత్వ మార్పు ఊహాగానాలకు బలం చేకూరింది. డీకే నవంబర్ 29న ఢిల్లీ వెళ్లి సోనియా గాంధీ (Sonia Gandhi)ని కలవనున్నారు. అదే రోజు తిరిగి బెంగళూరుకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రాహుల్ గాంధీ ఢిల్లీలో కర్ణాటక కాంగ్రెస్ నేతలు ప్రియాంక్ ఖర్గే, బచ్చేగౌడలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఓట్ చోరీ కేసు,సర్ ప్రక్రియలో జరిగిన ఘటనలు, రాష్ట్ర రాజకీయాల తాజా పరిస్థితులు, కర్ణాటక టెక్ సదస్సులో ఆవిష్కరించాల్సిన కొత్త AI పరికరం,మొత్తంగా పావుగంటకు పైగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
సిద్ధరామయ్య వ్యాఖ్యలపై రాహుల్ (Rahul Gandhi) అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. సిద్ధరామయ్య ఇటీవల అధికార పంపకం ఒప్పందం లేదని, తాను ఐదేళ్లు సీఎంగా ఉంటానని చేసిన వ్యాఖ్యలు హైకమాండ్‌కు అసౌకర్యం కలిగించాయి. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలపై తీవ్రమైన అసహనం వ్యక్తం చేశారని, అలాంటి వ్యాఖ్యలు పార్టీకే ఇబ్బందికరమని సూచించారని చెబుతున్నారు. అయితే అప్పుడే ఒప్పందాన్ని బహిరంగంగా తిరస్కరించాల్సిన అవసరం లేదు. త్వరలోనే వారిద్దరితో నేను మాట్లాడతాను అని రాహుల్ చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ తాజా పరిణామాలన్ని విశ్లేషిస్తే, డీకేకి అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు అర్ధమవుతుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే ఓ ప్రకటన చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాతే కర్ణాటక నాయకత్వ మార్పుపై నిర్ణయం తీసుకుంటాం అని అన్నారు. ఈ నేపథ్యంలో రాబోయే 48 గంటలలో కర్ణాటక రాజకీయాల్లో భారీ ట్విస్ట్ లు చోటు చేసుకునే అవకాశం ఉంది.