అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India – Russia | పాకిస్తాన్‌తో జరిగిన జరిగిన సైనిక ఘర్షణలో S-400 రక్షణ వ్యవస్థలు గేమ్ చేంజర్‌గా మారాయి. ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) సమయంలో ఇవి పాక్ జెట్లు, క్షిపణులను గాల్లోనే పేల్చేశాయి. భారత్ ను శత్రుదుర్భేధ్యంగా S-400 రక్షణ వ్యవస్థలు మార్చేశాయి.
ఈ నేపథ్యంలో మరిన్ని S-400 లను సమకూర్చుకోవడంపై కేంద్రం దృష్టి సారించింది. భూ ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే S-400 క్షిపణి(S-400 Missile) వ్యవస్థలను మరిన్ని కొనుగోలు చేసేందుకు రష్యాతో చర్చలు జరుపుతోంది. ఇండియా ఇప్పటికే S-400 వ్యవస్థను నిర్వహిస్తోందని, మరిన్ని కొత్త డెలివరీల కోసం చర్చలు జరుగుతున్నాయని రష్యా ఫెడరల్ సర్వీస్ ఫర్ మిలిటరీ-టెక్నికల్ కోఆపరేషన్ అధిపతి డిమిత్రి షుగేవ్(Dmitry Shugaev) పేర్కొన్నారు.
India – Russia | ఇప్పటికే జాప్యం
చైనా సైనిక శక్తిని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన ఐదు S-400 ట్రయంఫ్ వ్యవస్థల కోసం ఇండియా 2018లో రష్యాతో 5.5 బిలియన్ డాలర్లతో ఒప్పందం చేసుకుంది. అయితే, ఈ ఒప్పందం ప్రకారం S-400 ల సరఫరాలో తీవ్ర జాప్యం ఏర్పడింది. ఇప్పటికే మూడు యూనిట్లు రాగా, మరో రెండు యూనిట్లు 2027కి వచ్చే అవకాశముంది. ఇటీవల పాకిస్తాన్‌తో సైనిక సంఘర్షణ సందర్భంగా S-400 కీలకంగా వ్యవహరించాయి. ఈ నేపథ్యంలో మరిన్ని కొనుగోళ్లపై ఇండియా(India) రష్యాతో చర్చలు జరుపుతోంది.
India – Russia | నమ్మకమైన మిత్రదేశం
భారత్‌కు దశాబ్దాలుగా రష్యా అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా కొనసాగుతోంది. కష్టకాలంలోనూ అండగా నిలబడుతూ స్నేహాన్ని కొనసాగిస్తోంది. భారతదేశానికి ప్రధాన ఆయుధ సరఫరాదారుగా కొనసాగుతోంది. ఫ్రాన్స్, ఇజ్రాయెల్ నుంచి సైనిక రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరుగుతున్నప్పటికీ, , రష్యా మాత్రం అత్యధికంగా ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశంగా నిలిచింది. 2020 – 2024 మధ్య ఇండియా ఆయుధ దిగుమతుల్లో 36 శాతం రష్యా(Russia) నుంచి వచ్చాయని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ తెలిపింది.
India – Russia | మాస్కో మద్దతు..
దీర్ఘకాల వ్యూహాత్మక భాగస్వాములైన భారతదేశం, రష్యా గతంలో అనేక రక్షణ ప్రాజెక్టులలో పరస్పరం సహకరించుకున్నాయి. ఇందులో T-90 ట్యాంకులు. Su-30 MKI ఫైటర్ జెట్‌ల లైసెన్స్ పొందిన ఉత్పత్తి, MiG-29 కామోవ్ హెలికాప్టర్ల సరఫరా, విమాన వాహక నౌక INS విక్రమాదిత్య (గతంలో అడ్మిరల్ గోర్ష్‌కోవ్), భారతదేశంలో AK-203 రైఫిల్స్ ఉత్పత్తి. బ్రహ్మోస్ క్షిపణి కార్యక్రమాలు ప్రధానమైనవి.
India – Russia | అమెరికా హెచ్చరికలు పట్టించుకోకుండా..
రష్యాతో దీర్ఘకాల మైత్రిని భారత్ కొనసాగిస్తోంది. రక్షణ ఉత్పత్తులతో పాటు చమురును సైతం భారీగా కొనుగోలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సహకరించొద్దని అమెరికా ఒత్తిడిచేస్తోంది. అదే సమయంలో తమ దేశం నుంచే సైనిక, వ్యవసాయ ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
తమ హెచ్చరికలు పట్టించుకోకుండా రష్యాతో స్నేహం చేస్తున్న భారత్‌పై అగ్రరాజ్యం ఇటీవల 50 శాతం సుంకాలు పెంచింది. అమెరికా ఎన్ని రకాలుగా ఒత్తిడి తెస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం దీర్ఘకాలిక ప్రయోజనాల విషయంలో రాజీ పడడం లేదు. చమురుతో పాటు సైనిక ఉత్పత్తుల కొనుగోళ్లపై దృష్టి సారించింది. రష్యా నుంచి వనరుల కొనుగోలును నిలిపివేయాలని అమెరికా చేసిన డిమాండ్లకు భారతదేశం తలొగ్గలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్(Russian Foreign Minister Sergei Lavrov) తాజాగా వ్యాఖ్యానించారు.