అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jubilee Hills By-Election | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఎవరన్నది ఇంకా ఖరారు కాలేదు. అభ్యర్థిగా ఎవరిని నిలబెట్టాలో పార్టీ ఇంకా తేల్చలేదు. టికెట్ ఎవరికి కేటాయించాలనే దానిపై పార్టీలో అంతర్గతంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి.
అభ్యర్థి ఖరారుపై బీజేపీ ఎన్నికల కమిటీ శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమై చర్చలు జరిపింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ తదితర ముఖ్య నేతలు హాజరైన ఈ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ముగ్గురు పేర్లను జాతీయ నాయకత్వానికి పంపించాలని సమావేశంలో నిర్ణయించారు.
Jubilee Hills By-Election | ఎన్నికల కమిటీ భేటీ..
మరో రెండు, మూడు రోజుల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ అన్ని రకాల సన్నాహాలు చేసుకుంటోంది. శుక్రవారం సమావేశమైన బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ అభ్యర్థి ఖరారుపై దృష్టి సారించింది. ఉప ఎన్నికల్లో విజయం సాధించడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపింది. త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికపై ప్రధానంగా చర్చించారు. ప్రాధాన్యత క్రమంలో తొలి ముగ్గురి పేర్లను జాతీయ నాయకత్వానికి పంపించాలని సమావేశంలో నిర్ణయించారు.
Jubilee Hills By-Election | పోటాపోటీ..
బీజేపీ టికెట్ కోసం పార్టీలో తీవ్రమైన పోటీ నెలకొంది. తమకు అవకాశం కల్పించాలని చాలా మంది కోరుతున్నారు. ఈ మేరకు అధిష్టానం వద్ద తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ నేతలు లంకల దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, మాధవీలత, డాక్టర్ పద్మవిపనేని, మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావు మనుమడు ఎన్‌వీ సుభాష్ తదితరులు టికెట్ ఆశిస్తున్నారు. అయితే, ఇందులో లంకల దీపక్‌రెడ్డి, కీర్తిరెడ్డి, పద్మవిపనేనిలలో ఎవరికో ఒకరికి టికెట్ లభిస్తుందని భావిస్తున్నారు.