అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Congress | కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. ముఖ్యమంత్రి పనితీరుపై అమాత్యులు, శాసనసభ్యులు రగిలి పోతున్నారు.
తమ శాఖల్లో తీవ్ర జోక్యం చేసుకుంటున్నారని కొంత మంది మంత్రులు నొచ్చుకుంటుంటే, కమీషన్లు, కాంట్రాక్టుల విషయంలో సహకరించడం లేదని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఎమ్మెల్యేలైతే బహిరంగంగానే ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. సర్కారును నిందిస్తూ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy Rajagopal Reddy) వంటి వారు తరచూ వార్తల్లోకి ఎక్కుతుండగా, తాజాగా ఆ జాబితాలో మకరో ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి చేరారు. ఏవైనా పనులు అడిగితే చేయలేని పరిస్థితుల్లో ఉన్న తాము గ్రామాల్లోకి వెళ్లాలంటే ముఖం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేయడం కాంగ్రెస్ ఎమ్మెల్యే (Congress MLA)ల దుస్థితికి అద్దం పడుతోంది.
Congress | సమన్వయం లేక..
కాంగ్రెస్ పార్టీ (Congress Party) నేతృత్వంలోని ప్రభుత్వంలో సమన్వయం లోపించింది. అందరినీ సమన్వయం చేయాల్సిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ఒంటెద్దు పోకడలకు పోతున్నారన్న భావన్న అటు మంత్రుల్లో, ఇటు ఎమ్మెల్యేలో పెరిగి పోతోంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే సమయంలో తమను పరిగణనలోకి తీసుకోవడం లేదని, తమ శాఖల్లో తమకు తెలియకుండానే పనులు జరిగిపోతున్నాయని మంత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఎమ్మెల్యేలు సైతం తమకు నిధులు ఇవ్వడం లేదని, నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి అడిగితే స్పందన రావడం లేదని వాపోతున్నారు. నిధులు ఇవ్వకుండా తాము నియోజకవర్గాల్లో ఎలా తిరగాలని ప్రశ్నిస్తున్నారు.
Congress | రగిలిపోతున్న అమాత్యులు..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో పాటు కొందరు కేబినెట్ సహచరులపై కొందరు మంత్రులు లోలోపల తీవ్రంగా రగిలి పోతున్నారు. పరిధి దాటి వ్యవహరిస్తున్నారని తమ అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా సీఎం రేవంత్‌రెడ్డిని టార్గెట్ చేస్తూ మీడియాకు లీకులు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి నలుగురు, ఐదుగురికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ మిగతా సహచరులను పట్టించుకోవడం లేదని మంత్రులు మండిపడుతున్నారు. ప్రధానంగా బీసీ వర్గానికి చెందిన అమాత్యులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదే విషయమై గత వారం జరిగిన కేబినెట్ భేటీలో నేరుగా ముఖ్యమంత్రినే ఒకరిద్దరు నిలదీశారు. రవాణా శాఖ మంత్రిగా ఉన్న తనకు తెలియకుండా చెక్‌పోస్టులు ఎలా ఎత్తేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) గట్టిగానే ప్రశ్నించారు. ఇక, దేవాదాయ శాఖ పరిధిలోని మేడారం అభివృద్ధి పనులను మరో శాఖకు అప్పగించడంపైనా మంత్రిమండలి సమావేశంలో వాడివేడి చర్చకు దారి తీసిందని తెలిసింది. బీసీ వర్గానికి చెందిన మహిళా మంత్రిని కావాలనే అవమానించడం సరికాదని బీసీ వర్గ మంత్రులు కేబినెట్ భేటీలో అన్నట్లు ప్రచారం జరిగింది. అందరినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన ముఖ్యమంత్రి ఇలా ఒకరిద్దరికే ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
Congress | ఎమ్మెల్యేల అసంతృప్త రాగం
ఇక, కాంగ్రెస్ ఎమ్మెల్యేల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కేటాయించేందుకు నిధులు ఇవ్వక పోవడంపై శాసనసభ్యులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీలో ఉండి కూడా పని చేయలేని తాము ఎమ్మెల్యేలుగా ఉండి ఏం లాభమని బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. మంత్రి పదవి రాలేదని ఇప్పటికే తీవ్ర అసంతృప్తిలో ఉన్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తరచూ ప్రభుత్వంపై నేరుగానే విమర్శలు చేస్తున్నారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేలు సైతం సొంత ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి (Ennam Srinivasa Reddy) కూడా బహిరంగంగానే తన అసంతృప్తిని వెల్లడించారు. రూ.లక్ష, రూ.2 లక్షల పనులు మంజూరు చేసేందుకు కూడా తమ దగ్గర నిధులు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. లక్ష కోట్లు అప్పు తెచ్చి ఏం చేస్తున్నారని సొంత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలుగా తమ పరిస్థితి చెప్పుకోలేకుండా ఉందని, నిధులు లేక ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరగలేక పోతున్నారని వాపోయారు.

