Homeజిల్లాలుకామారెడ్డిKamareddy SP | విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన పాటించాలి: ఎస్పీ రాజేష్ చంద్ర

Kamareddy SP | విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన పాటించాలి: ఎస్పీ రాజేష్ చంద్ర

పోలీసు సిబ్బంది నిబద్ధతో పాటు విధుల్లో సమయపాలన పాటించాలని ఎస్పీ రాజేష్​ చంద్ర పేర్కొన్నారు. బీబీపేట పోలీస్​స్టేషన్​ను సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy SP | పోలీస్ సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన ఖచ్చితంగా పాటించాలని ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. బీబీపేట్ పోలీస్ స్టేషన్‌ను (Bibipet Police Station) సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

పోలీస్​స్టేషన్ పరిసర ప్రాంతాలు, సిబ్బంది బ్యారక్ పరిశీలించి, శుభ్రతను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. రోల్​కాల్‌ను (Police Rollcall) పరిశీలించి, సిబ్బంది హాజరు వివరాలను తెలుసుకున్నారు. మానవ వనరుల సమర్థ వినియోగం, రోల్ కాల్ ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దర్యాప్తు ప్రక్రియలో కానిస్టేబుళ్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రతి కేసును నిజాయితీతో, నైపుణ్యంతో, సమగ్రంగా విచారించి ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి పోలీస్ అధికారిపై ఉందన్నారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఫిర్యాదులపై వేగంగా స్పందించి తక్షణమే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగైన పోలీసింగ్ సాధ్యమవుతుందని తెలిపారు.

బ్లూ కోల్ట్స్ (Blue Colts), పెట్రో కార్ విధుల్లో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద చర్యలపై వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. అనుమానితుల ప్రతి కదలికపై నిఘా పెట్టాలని, నేరాల అదుపునకు పటిష్టమైన గస్తీ–పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని, వీపీవోలు తమకు కేటాయించిన గ్రామాలను తరచూ సందర్శిస్తూ, సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని సూచించారు.

ప్రజల రక్షణే ధ్యేయంగా భావిస్తూ విధుల్లో నిబద్ధత చూపాలన్నారు. డయల్ 100 ద్వారా అందే ఫిర్యాదులపై వేగంగా, సమర్థవంతంగా స్పందిస్తూ ప్రజలకు విశ్వాసం కలిగించేలా వ్యవహరించాలని అధికారులకు, సిబ్బందికి ఎస్పీ సూచించారు. నేరాలను ఛేదించడానికి కీలకంగా ఉపయోగపడే సీసీ కెమెరాల ప్రాధాన్యతను ప్రజలకు వివరిస్తూ, స్వచ్ఛందంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా చూడాలన్నారు. ఎస్పీ వెంట కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, ఎస్సై ప్రభాకర్, సిబ్బంది ఉన్నారు.