అక్షరటుడే, వెబ్‌డెస్క్ : kolkata stadium | అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో నిలిచిన లియోనెల్ మెస్సీ భారత పర్యటన తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’(GOAT Tour of India)లో భాగంగా కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమం అనూహ్యంగా రసాభాసగా మారింది.
అధిక ధరలు చెల్లించి టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు తమ అభిమాన ఆటగాడిని సరిగ్గా చూడలేకపోయామంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మెస్సీ (Lionel Messi) స్టేడియంలోకి అడుగుపెట్టగానే ఆయన చుట్టూ రాజకీయ నాయకులు, ప్రముఖులు, భద్రతా సిబ్బంది కలిపి సుమారు వంద మందికిపైగా గుమిగూడారు. దీంతో గ్యాలరీల్లో కూర్చున్న అభిమానులకు మెస్సీ ఒక్కసారిగా కూడా స్పష్టంగా కనిపించలేదు.
kolkata stadium | హింసాత్మకంగా మారిన నిరసన
భారీ మొత్తంలో డబ్బు ఖర్చు చేసినా తమ స్టార్‌ను చూడలేకపోయామన్న ఆవేదన అభిమానుల్లో (FAns )ఆగ్రహంగా మారింది. అసంతృప్తితో కొందరు అభిమానులు స్టేడియంలోని కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేయడం, బ్యానర్లను చించివేయడం మొదలుపెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మెస్సీ కేవలం 20 నుంచి 25 నిమిషాల వ్యవధిలోనే కార్యక్రమాన్ని ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఒక వీడియో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఓ అభిమాని స్టేడియంలోని కార్పెట్‌ను భుజంపై వేసుకుని బయటకు తీసుకెళ్తూ కనిపించాడు.
రిపోర్టర్ (Reporter) ప్రశ్నించగా, అతడు స్పందిస్తూ..“రూ.10,000 పెట్టి టికెట్ కొనుగోలు చేశాను. కానీ మెస్సీ ముఖం కూడా చూడలేకపోయాను. నాకు కనిపించిందల్లా నాయకుల ముఖాలే. అందుకే ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ కార్పెట్ ఇంటికి తీసుకెళ్తున్నా” అని చెప్పాడు. ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుండగా, నెటిజన్లు కొందరు నవ్వులు పూయించేలా కామెంట్లు చేస్తుంటే, మరికొందరు నిర్వాహకుల వైఫల్యంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రపంచ స్థాయి స్టార్ పర్యటనలో ఇలాంటి అవ్యవస్థ తగదని అభిప్రాయపడుతున్నారు.