అక్షరటుడే, వెబ్డెస్క్ : Chepa Prasadam | హైదరాబాద్(Hyderabad)లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ (Nampally Exhibition Ground)లో చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. మృగశిర కార్తె సందర్భంగా ఏటా బత్తిని గౌడ్ కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. దీనిని తీసుకుంటే ఆస్తమా, ఉబ్బసం, శ్వాస సంబంధ వ్యాధులు తగ్గుతాయని ప్రజల నమ్మకం. దీంతో ఏటా లక్షలాది మంది చేప ప్రసాదం కోసం వస్తారు.
మిరుగు సందర్భంగా ఆదివారం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం (Chepa Prasadam) పంపిణీ చేపట్టారు. ఈ క్రమంలో మెదక్ (Medak) జిల్లాకి చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడికి క్యూలైన్లో ఉండగా గుండెపోటు వచ్చింది. స్పృహ తప్పి పడిపోయిన వృద్ధుడికి సీపీఆర్ చేసినా ఫలితం లేకుండా పోయింది. సత్యనారాయణ మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
గతేడాది సైతం క్యూలైన్లో సొమ్మసిల్లి పడిపోయి ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో ఈ సారి అధికారులు, నిర్వాహకులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 42 క్యూ లైన్లలో కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రసాదం పంపిణీ చేపట్టారు. కాగా.. సోమవారం ఉదయం 9 గంటలకు వరకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.