అక్షరటుడే, కామారెడ్డి: Mla KVR | అవినీతి రహిత కామారెడ్డి కోసం చేసే ప్రయత్నంలో కొన్ని ఇబ్బందులు తప్పవని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి (MLA Katipally Venkata Ramana Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలోని రాజిరెడ్డి గార్డెన్లో సోమవారం సాయంత్రం బీజేపీ మద్దతుతో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
Mla KVR | అభ్యర్థులతో మాటామంతి..
ముందుగా ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులతో మాట్లాడారు. ఓటమికి గల కారణాలు, గ్రామాల పరిస్థితులను.. పోటీ చేసిన అభ్యర్థుల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కామారెడ్డిలో పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం లేకుండా ప్రజా సేవచేసే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన గెలిచిన సర్పంచ్లకు (Sarpanches) శుభాకాంక్షలు తెలియజేశారు. ఓడిన అభ్యర్థులు అధైర్యపడొద్దని సూచించారు.
Mla KVR | ప్రజలకు సేవచేయాలి..
డబ్బు, మద్యం లేకుండా గెలిస్తే ఐదేళ్ల పదవి కాలంలో ప్రజలకు సేవచేసే అవకాశం వస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందుకే బీజేపీ బలపర్చిన అభ్యర్థులు మద్యం, డబ్బు లేకుండా సర్పంచ్ ఎన్నికల్లో పోటీచేసే ప్రయత్నం చేశారన్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా పోటీచేసి ప్రజల వద్దకు వెళ్తామన్నారు. మార్పుకోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో ఇబ్బందులు తప్పవని, ఏది ఏమైనా ప్రజల తీర్పు శిరసావహిస్తామని పేర్కొన్నారు. అనంతరం వివిధ గ్రామాల్లో గెలిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను శాలువాతో సన్మానించారు.