అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Konda Surekha | వరంగల్ కాంగ్రెస్‌లో (Warangal Congress) విభేదాలు చల్లారడం లేదు. గత కొంతకాలంగా మంత్రి కొండా సురేఖ భర్త మురళికి (Konda Murali) ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పడటం లేదు.
తాజాగా మరోసారి రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా వర్గపోరు బయటపడింది. మంత్రి కొండా సురేఖ రాకముందే కాంగ్రెస్ నేతలు రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) విగ్రహానికి నివాళి అర్పించారు. దీనిపై మంత్రి సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొండా మురళి స్టేషన్ ఘన్పూర్ కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవురి ప్రకాశ్‌రెడ్డిపై గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అప్పటి నుంచి రెండు వర్గాల మధ్య పోరు నడుస్తోంది. మంత్రి సురేఖ సైతం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డిపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏకమయ్యారు. కొండా దంపతులకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
Konda Surekha | రాజీకి ప్రయత్నించినా..
వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరుపై పీసీసీ (PCC) క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే పలుమార్లు సమావేశం నిర్వహించింది. నేతల మధ్య రాజీ కుదర్చడానికి ఛైర్మన్ మల్లు రవి (Mallu Ravi) ప్రయత్నాలు చేశారు. కొండా మురళికి సర్ది చెప్పారు. ఈ మేరకు స్థానిక ఎన్నికల్లో (Local Body Elections) కలిసి పని చేస్తామని కొండా మురళి స్పష్టం చేశారు. అంతేగాకుండా వరంగల్ పంచాయితీ పరిష్కారం కోసం కమిటీ వేస్తామని మల్లు రవి తెలిపారు. అయినా నేతల మధ్య మాత్రం సఖ్యత కుదరడం లేదు.
Konda Surekha | వేర్వేరుగా రాజీవ్‌గాంధీ జయంతి
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు బుధవారం రాజీవ్‌గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించాయి. వరంగల్‌లో నిర్వహించిన వేడుకలకు మంత్రి సురేఖ హాజరు కావాల్సి ఉంది. అయితే ఆమె రాకముందే పలువురు కాంగ్రెస్ నేతలు నివాళి అర్పించారు. ఎర్రబెల్లి స్వర్ణ, బస్వారాజు సారయ్య, నాగరాజు మంత్రి రాకముందే నివాళి అర్పించి వెళ్లిపోయారు. దీంతో కొండా సురేఖ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రాకముందే పూలమాల వేయడం.. వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ మండి పడ్డారు.