అక్షరటుడే, వెబ్‌డెస్క్: Radhika Apte | బాలీవుడ్(Bollywood) నటి రాధికా ఆప్టే actress Radhika Apte) ఇటీవల తన గర్భధారణ తొలినాళ్లలో ఎదుర్కొన్న సవాళ్లను బయటపెట్టింది. భారతీయ వినోద పరిశ్రమలో తాను అనుభవించిన వేదన, సానుభూతి లేకపోవడం గురించి ఆమె ప్రస్తావించారు.
Radhika Apte | నేహా ధూపియా ఫ్రీడమ్ టు ఫీడ్ లైవ్ సెషన్‌లో మాట్లాడుతూ..
తన వృత్తిపరమైన కట్టుబాట్లను నెరవేర్చుకుంటూనే.. గర్భధారణను ప్రకటించిన తర్వాత తాను అసహనాన్ని ఎదుర్కొన్నానని రాధికా ఆప్టే తెలిపారు.
“నేను గర్భం ధరించిన తొలినాళ్లలో షూటింగ్ సమయంలో ఒక భారతీయ నిర్మాత నా ప్రెగ్నెన్సీపై అసహనం వ్యక్తం చేశారు. ఆయన సంతోషంగా లేరు” అని ఆమె ఒక హిందీ సినిమాను ప్రస్తావిస్తూ మాట్లాడారు.
“గర్భం వల్ల నాకు అసౌకర్యం, ఉబ్బరం ఉన్నప్పటికీ.. నేను బిగుతుగా ఉండే దుస్తులు ధరించాలని పట్టుబట్టాడు. అప్పుడు నాకు మూడో నెల. ఎన్నో కోరికలు.. నేను చాలా తింటున్నాను.. శారీరక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.. కానీ అతను అర్థం చేసుకోవడానికి బదులుగా, అసహనాన్ని వ్యక్తం చేశారు.” అని రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు.
రాధికా ఆప్టే ఇంకా ఇలా చెప్పారు.. “నేను సెట్‌లో నొప్పి, అసౌకర్యంగా ఉన్నప్పుడు వైద్యుడిని కలవడానికి కూడా నన్ను అనుమతించలేదు. అది నన్ను నిజంగా చాలా బాధపెట్టింది.” అని ఆవేదన వ్యక్తం చేశారు.
Radhika Apte | అదే సమయంలో అంతర్జాతీయ సినిమా విషయంలో..
రాధికా ఆప్టే దాదాపు అదే సమయంలో తాను పాల్గొన్న ఒక అంతర్జాతీయ(Hollywood) సినిమాలో తనకు ఎదురైన విభిన్న అనుభవం గురించి మాట్లాడారు.
“నేను పనిచేస్తున్న హాలీవుడ్ చిత్రనిర్మాత చాలా సహాయకారిగా ఉన్నారు. నేను సాధారణం కంటే ఎక్కువగా తింటున్నాను.. షూటింగ్ ముగిసే సమయానికి పూర్తిగా భిన్నమైన వ్యక్తిలా కనిపించవచ్చు.. అని నేను చెప్పినప్పుడు, అతను నవ్వుతూ, ‘చింతించకండి, ఈ ప్రాజెక్ట్ ముగిసే సమయానికి మీరు మరొక వ్యక్తి అయినా, పర్వాలేదు. ఎందుకంటే మీరు గర్భవతి.’ అని అన్నారు. ఆ భరోసా నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది.. అని అన్నారు.
రాధికా ఆప్టే 2011లో లండన్(London)లో సమకాలీన నృత్యం నేర్చుకోవడానికి తీసుకున్న విశ్రాంతి సమయంలో సంగీతకారుడు బెనెడిక్ట్ టేలర్‌ను కలిశారు.
మార్చి 2013లో జరిగిన వారి అధికారిక వేడుకకు ముందే ఈ జంట రిజిస్టర్డ్ వివాహం చేసుకుంది. నటి రాధికా ఆప్టే అక్టోబరు 2024లో తన గర్భవతి అని ప్రకటించారు.
